మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎంపీ
సాక్షి, చౌటుప్పల్ (నల్గొండ): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన డాకోజి రామకృష్ణ, ఆయన కుమారుడు ఈశ్వర్‌సాయి మృతదేహాలను శనివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రోడ్డు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని బాధితుల పరిస్థితి, అందుతున్న వైద్యసేవల గురించి హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రి యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు. ఒకే ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో పాటు తల్లి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం పట్ల ఎంపీ చలించారు.
కన్నీళ్లను ఆపుకుంటూ బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయ్యప్ప భక్తుడిగా 18సార్లు మాల ధరించిన వ్యక్తిని భగవంతుడు కాపాడలేకపోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి ముందు కూడా శివుడిని దర్శనం చేసుకొని వస్తుండడం హృదయవిదారకరమన్నారు. తక్షణ సాయంగా 1.50లక్షల రూపాయలను అందజేశారు. రామకృష్ణ భార్య లక్ష్మి, పెద్ద కుమారుడు మణిచరణ్‌ల వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని తెలిపారు.
చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్)
జరగరాని ఘోరం జరిగినప్పటికీ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు. గ్రామస్తులు, ఇతర ముఖ్యులు బాధిత కుటుంబానికి సాయం అందించాలని కోరారు. ఆయన వెంట కౌన్సిలర్లు కొయ్యడ సైదులుగౌడ్, కాసర్ల మంజుల శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొగుదాల రమేష్‌గౌడ్, వెంకటయ్య, బక్క శ్రీనాధ్, జిల్లా కార్యదర్శులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నర్సింహ్మ, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తల్లి, కుమారుడికి తప్పిన ప్రాణాపాయం
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని పంతంగి టోల్‌గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లీ కుమారుడికి ప్రాణాపాయం తప్పింది. ఆగిఉన్న డీసీఎంను వెనుకనుంచి బైక్ ఢీకొట్టడంతో చౌటుప్పల్ పట్టణంలోని లక్కారం గ్రామానికి చెందిన తండ్రి, కుమారుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాకోజి లక్ష్మి(40), ఆమె పెద్ద కుమారుడు మణిచరణ్(13)లు చికిత్స పొందుతున్నారు. మణిచరణ్‌కు కరోనా టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో, హస్తినాపురంలోని మమతా ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మి కామినేని ఆస్పత్రిలోనే కోలుకుంటోంది. ఇద్దరికీ పలు సర్జరీలు అవసరమని వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment