
చౌటుప్పల్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7లక్షల మంది దళిత, గిరి జనులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఇస్తే తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చే స్తానని పేర్కొన్నారు.
ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రకటించారన్నారు. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన రోజునే కేసీఆర్ ఓడిపోయినట్టని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నానని, ఇప్పటికే రెండుసార్లు ప్రధాని మోదీని కలిశానని, రూ.3 వేల కోట్లకు పైగా నిధులు రాబట్టానని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపురం వరకు రూ.600 కోట్లతో నిర్మించనున్న ఆరు వరుసల రహదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.