![MP Komatireddy Venkata Reddy came from Australia to Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/2/MP-Komatireddy-Venkata-Redd_0.jpg.webp?itok=cVNP-UMn)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. గత నెల 21న విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో వెంకట్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తాన్నది అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కానీ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన సరిగ్గా పోలింగ్‌కు ముందు రోజు రావడం ఆసక్తికరంగా మారింది.
ఆడియో లీక్ నేపథ్యంలో..
బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్తతో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో కొద్దిరోజుల కింద లీకవడం కలకలం రేపింది. దీనిపై ఏఐసీసీ గత నెల 23నే ఆయనకు నోటీసిచ్చింది. పది రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది. ఆ గడువు గురువారంతో ముగియనుంది. మరోవైపు రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెంకటరెడ్డి జోడో యాత్రలో పాల్గొంటారా, లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే మునుగోడు విషయంలో తాను స్పష్టంగా ఉన్నానని, తన ఆలోచనను అధిష్టానానికి చెప్పానని వెంకట్‌రెడ్డి సన్నిహితులతో పేర్కొన్నట్టు తెలిసింది. కొందరు ఫేక్ ఆడియోలు సృష్టించి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని.. దీనిపై తనకు క్లీన్‌చిట్ వచ్చేంత వరకు అధిష్టానం పెద్దలను కానీ, పార్టీ నేతలనుగానీ కలవబోనని వెంకట్‌రెడ్డి అన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఏఐసీసీ నోటీసుకు వెంకట్‌రెడ్డి ఎలా స్పందిస్తారు? గడువు ముగిసేలోపు సమాధానమిస్తారా లేదా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment