పెళ్లికెళ్లాలంటే కరోనా టెస్ట్‌ చేయించుకోవాల్సిందే.. | MRO permission required for Marriages over corona effect | Sakshi
Sakshi News home page

మిస్సయిన పెళ్లి‘కళ’..

Published Wed, Jul 29 2020 2:46 AM | Last Updated on Wed, Jul 29 2020 2:46 AM

MRO permission required for Marriages over corona effect - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు ‘నెల’వు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్‌ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు. పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహా సాలు, ఆడంబరాలు ఇక ‘గతం’ కానున్నాయి. ఆగస్టు 15 వరకు ఉన్న ముహూర్తాలలో ఏదో ఒకటి నిశ్చయం చేసుకుని.. గతంలో వాయిదాపడిన వివాహాలతో పాటు కొత్తవీ ‘ఏదో కానిచ్చేద్దా’మనే యోచనలో పలువురు ఉన్నారు. బంధుమిత్రుల సమక్షంలో సందడిగా జరుపుకునే పెళ్లిళ్లను భయం భయంగా కొద్దిమందితోనే కానిచ్చేస్తున్నారు. 

ఏదీ నాటి సందడి?: సాధారణంగా శ్రావణ మాసంలో వేలాది వివాహాలతో ఊరూవాడా పెళ్లిపందిళ్లను తలపిస్తాయి. అనుకున్న ముహూర్తానికి వంటల దగ్గరి నుంచి మూడు ముళ్లు వేయించే పురోహితుల వరకు అందరినీ సమన్వయం చేసుకోలేక.. ఫంక్షన్‌ హాళ్లు లభించక ఎంతో హైరానా.. ఇక, ఏకకాలంలో ఐదారు పెళ్లిళ్లకు హాజరయ్యే పరిస్థితి.. పెళ్లంటే నెల ముందే సందడి మొదలయ్యేది. ఆహ్వాన పత్రికలు పంచడం దగ్గరి నుంచి ఏడడుగులు వేయడం వరకు ఎంతో హడావుడి. అన్నిటికీ ముందస్తు బుకింగ్‌లు.. ఎంత ఖర్చయినా పర్వాలేదు.. గ్రాండ్‌గా ఉండాలనే తలంపుతో ఎన్నెన్నో ప్లాన్‌లు.. ఇదంతా కరోనాకు ముందు పరిస్థితి.. ఇప్పుడీ కరోనా కాలంలో పెళ్లి చేయాలంటే సవాలక్ష ఆంక్షలు.. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి.. ఫలితంగా పదులు, వందల సంఖ్యలోనే ఈ శ్రావణంలో చాలామంది తటపటాయిస్తూనే ముహూర్తాలను పెట్టుకుంటున్నారు. జూలై 29, 31, ఆగస్టు 2, 3, 4, 5, 6, 7, 8, 11, 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. 

క్లిక్‌ లేదు – పిలుపు.. కుదింపు
గతంలో పెళ్లికి తాహతుకు మించైనా ఎక్కువ మందిని ఆహ్వానించే వారు. పెండ్లి పత్రికలే వెయ్యి నుంచి 1,500 వరకు ఆర్డర్‌ ఇచ్చేవారు. ఇవిప్పుడు వంద నుంచి 200కే పరిమితమవుతున్నాయి. ఆంక్షల కారణంగా ఎక్కువ మందిని పిలిచే అవకాశం లేక.. అతిథుల జాబితాను కుదిస్తున్నారు. దగ్గరి బంధువులు, ముఖ్యమైన వారికే పిలుపులు అందుతున్నాయి. పెళ్లి సంగతలా ఉంచితే, వీడియో, ఫొటోగ్రాఫర్ల హడావుడి అంతాఇంతా కాదు. సినిమా మాదిరి పెళ్లిని చిత్రీకరించేందుకు కనీసం ముగ్గురు నలుగురు వీడియో, ఫొటోగ్రాఫర్లు ఉండేవారు. ప్రస్తుతం ఒక్కరితోనే సరిపెట్టేస్తున్నారు. ఫలితంగా చాలామంది వీడియో, ఫొటోగ్రాఫర్లు పెళ్లి కాంట్రాక్టులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. 

పెళ్లికెళ్లాలంటే కరోనా టెస్ట్‌ చేయించుకోవాల్సిందే..
కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా పెళ్లికి వచ్చేవారు కరోనా టెస్టు చేయించుకుని ఆ రిపోర్టును తహసీల్దార్‌కు ఇవాల్సిన పరిస్థితి ఉంది. తహసీల్దార్‌ ఓకే అంటేనే పెళ్లికి వెళ్లేది. ఇలా వచ్చే వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఎలా అని అటు ఆహ్వానించే వారు, ఇటు ఆహ్వానితులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లికి వచ్చేవారు ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్న నిబంధన కూడా కొన్నిచోట్ల ఇబ్బందిపెడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లికి వచ్చిన బంధువులు అలా ముఖం చూపించి వెళ్లిపోతున్నారు.

ఫంక్షన్‌ హాలు దొరకాలంటే నాడెంతో టెన్షన్‌
ఎంత పెద్ద ఫంక్షన్‌ హాలులో పెళ్లిచేస్తే అంత గొప్ప అన్నట్టుండేది. సినిమా సెట్టింగులను మించి ఫంక్షన్‌ హాళ్లు, వివాహ వేదికలు తళుక్కుమనేవి. ఇప్పుడంతా మినీ హాళ్లకే పరిమితవుతున్నారు.  శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్‌లో హాళ్లు దొరకాలంటే తల ప్రాణం తోకకొచ్చేది. ఇప్పుడు ఏ ఇంట పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారో తెలుసుకుని మరీ ఫంక్షన్‌ హాళ్ల యజమానులే ఎదురు ఫోన్‌ చేస్తున్నారు. తక్కువ మొత్తానికి ఫంక్షన్‌ హాళ్లను ఇస్తామంటున్నారు. ఏదైనా వివాహ కార్యక్రమం జరుగుతుందంటే ఫంక్షన్‌ హాలులో పనిచేసే వారు 20 నుంచి 50 మంది వరకు ఉండేవారు. ఇప్పుడు ఇటువంటి వారి ఉపాధికి గండిపడింది.

మోగని బ్యాండ్‌ బాజా
గతంలో పెళ్లిళ్లూ, విందుల్లో ఆర్కెస్ట్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. జిగేల్‌మనే దీపాలు, డీజే, బ్యాండుమేళాలతో పెళ్లి ప్రాంగణం మారుమోగేది. కరోనా ఆంక్షలతో వీటికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఆర్కెస్ట్రాలకూ, బ్యాండ్‌బాజాలకు పనిలేకుండా పోయింది. అందులో పనిచేసే వారు ఇతర పనులు వెతుక్కుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement