యశవంతపుర(కర్ణాటక): కరోనా వైరస్ వెంటాడుతున్న సమయంలో పెళ్లిళ్లు చేయటం, పెద్దసంఖ్యలో బంధుమిత్రులు కలవటం, తరువాత అందరికీ కరోనా సోకడం వంటి సంఘటనలు అక్కడక్కడా సంభవిస్తున్నాయి. దీంతో వైరస్‌ను కట్టడి చేయడం ప్రభుత్వానికి దుర్లభమవుతోంది. కరోనా ప్రబలుతున్నందున బాగలకోట, కలబురిగి జిల్లా పరిధిలో వివాహలకు అనుమతులను ఇవ్వవద్దని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గోవింద కారజోళ ఆ కలెక్టర్లను ఆదేశించారు. డీసీఎం కారజోళ రెండు జిల్లాలకు చెందిన కలెక్టర్లకు లేఖలు రాశారు. అంత అవసరమైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. రెండు జిల్లాల పరిధిలో పెళ్లిళ్లలో పాల్గొన్నవారిలో ఎక్కువగా కరోనాకు గురైనట్లు మంత్రి తెలిపారు. ఇటీవల బాగలకోట, కలబురిగి జిల్లాలలో పెళ్లిళ్లలో పాల్గొన్న అతిథులకు కరోనా సోకటంతో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్లకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టంచేశారు.
బాగలకోట జిల్లాలో కట్టుదిట్టం
బాగలకోట జిల్లా పరిధిలో పెళ్లి, సీమంతం, అంత్యసంస్కారాలలో పాల్గొన్నవారిలో 70 మందికి పాజిటివ్ వచ్చినట్లు బాగలకోట జిల్లా కలెక్టర్ కే.రాజేంద్ర తెలిపారు. కలాగది అబ్కారి ఎస్‌ఐ పెళ్లి, ఇళకల్‌లో పెళ్లి, డాణక శిరూరలో సీమంతం, చిక్కమ్యాగేరిలో రైల్వే టికెట్ కలెక్టర్ అంత్యక్రియల్లో పాల్గొన్నవారిలో ఎక్కువగా కరోనా బయట పడినట్లు కలెక్టర్ తెలిపారు. వధూవరులు, నలుగురైదుగురు బంధువులు హాజరయ్యే రిజిస్ట్రేషన్ పెళ్లిళ్లకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు. శవ సంస్కారాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమస్తామన్నారు.
బాగల్‌కోట జిల్లాలో నలుగురు పోలీసులకు కరోనా సోకింది. జమఖండి తాలూకా ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు వైద్యులు వైరస్‌కు గురయ్యారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కరోనా సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 4 తాలూకాలలో 36 ఫ్లయింగ్ స్క్వాడ్‌ని నియమించి ప్రజలు గుంపులుగా చేరటం నియంత్రిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాగా మంత్రి, కలెక్టర్ ఆదేశాలను ప్రజలు పాటిస్తారా, లేదా? అన్నది మునుముందు తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment