సాకక్షి, హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)కు మునుగోడు ఉప ఎన్నికల గ్రహణం పట్టింది. ఫలితంగా ఆస్పత్రిలో పాలనాపరంగా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. నిమ్స్‌కు కొత్త డైరెక్టర్‌ను నియమించనున్న నేపథ్యంలో ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో వైద్యశాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఆ శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, డీఎంఈ డాక్టర్ కె.రమేష్రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ సెర్చ్ కమిటీ సమావేశం అయ్యేందుకు ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక అడ్డంకిగా మారింది. అంతేగాకుండా తన అనారోగ్య కారణంగా డైరెక్టర్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు మనోహర్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇటీవల నెలరోజుల పాటు సెలవుపై వెళ్లిన ఆయన గుండె సంబంధిత సమస్యకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకున్న చికిత్స వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి విధులకు హాజరైనప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక్క ఫైల్ కదలడం లేదు. ఒకటో రెండో ఫైల్స్ మినహా మిగిలిన ఫైళ్లన్నీ డైరెక్టర్ టేబుల్‌పైనే పేరుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా 2015లో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మనోహర్ ఇప్పటి వరకూ కొనసాగింపు నిమ్స్ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధమని ఓ అధికారి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం కొత్త డైరెక్టర్‌ను నియమించాలన్న నిర్ణయానికి వచి్చంది. ఆ మేరకే ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసింది.
ఆరుగురు వైద్యుల ప్రయత్నాలు
నిమ్స్ సంచాలకుడి పదవిని దక్కించుకునేందుకు ఆరుగురు వైద్యులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిమ్స్ రేడియాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ ఎస్.రామ్మూర్తి, నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, నిమ్స్ డీన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ నగరి బీరప్పతో పాటు డీఎంఈ డాక్టర్ కె.రమేష్‌రెడ్డితో మరో ఇద్దరు వైద్యులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నిమ్స్ డైరెక్టర్ పదవికి అర్హులైన వారిని సెర్చ్ కమిటీ నిర్ణయించాల్సి ఉంది. కానీ మునుగోడు ఉప ఎన్నిక కారణంగా ఇంతవరకు సమావేశం జరగని పరిస్థితి.
అయితే నిమ్స్ డీన్‌గా వ్యవహరించిన రామ్మూర్తి పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ మెప్పు పొందారు. నిమ్మ సత్యనారాయణకు కూడా ఆస్పత్రి పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉంది. అవయవ మారి్పడి ఆపరేషన్లో గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బీరప్ప ఇటీవలే నిమ్స్ డీన్ బాధ్యతలను చేపట్టారు. డీఎంఈ రమేష్‌రెడ్డిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త డైరెక్టర్ ఎవరు వస్తారనే అంశంపై వైద్య, ఉద్యోగవర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment