సాక్షి, హైదరాబాద్: మునుగోడుపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్‌ఎస్, బీజేపీల కంటే ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి పేరును అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక అనేక కారణాలున్నాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్ నేతలు కూడా టికెట్ ఆశించినప్పటికీ స్రవంతిని ఖరారు చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద స్కెచ్చే వేసిందని అంటున్నారు.
ప్రత్యర్థులకు షాక్..!
మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనలో వ్యూహాన్ని మార్చింది. ముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ మొదట్లోనే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కానీ టీఆర్‌ఎస్, బీజేపీలు భారీ బహిరంగ సభలు నిర్వహించి కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో వేచి చూద్దామనే ధోరణిని ప్రదర్శించింది.
నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఇలాంటి సంకేతాలనే ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటిస్తూ శుక్రవారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు బరిలో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే వ్యూహంతోనే అనూహ్యంగా అభ్యర్థి పేరు వెల్లడించిందని అంటున్నారు.
ప్రచారంలో వెనుకబడకుండా..
ప్రచారంలో వెనుకబడకుండా ఉండటం, నియోజకవర్గంలోని కేడర్‌ను ముందుండి నడిపే సారథిని చూపించడం, అభ్యర్థిని త్వరగా ప్రకటించాలంటు న్న ఆశావహులు, స్థానిక కేడర్ ఒత్తిళ్లు.. ఇవన్నీ దృష్టి లో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ముందే అభ్యర్థిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీలు అధి కారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రచారంలో దూసుకెళుతున్నాయి.
కానీ కాంగ్రెస్ మా త్రం ప్రజాక్షేత్రంలో పెద్దగా సత్తా చూపించలేకపోతోంద నే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమైంది. మరో వై పు నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటం, అయినా వారితో కనీసం మాట్లాడేవారు లేకపోవడం, హైదరాబాద్ నుంచి వచ్చే రాష్ట్ర స్థాయి నాయకులు అడపాదడపా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అ వుతుండడంతో పరిస్థితి చేయి జారుతోందనే అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
స్రవంతివైపే మొగ్గు
అభ్యర్థి విషయంలో జరిపిన అభిప్రాయసేకరణలో ఎక్కువ మంది స్రవంతి పేరు సూచించినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతల్లో కొంత అభిప్రాయ భేదాలున్నప్పటికీ స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితులు కొందరు చల్లమల్ల కృష్ణారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారనే చర్చ జరిగినా, చివరకు రేవంత్ టీం కూడా పూర్తి అధికారాలు అధిష్టానానికే అప్పగించింది.
మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇటీవల ప్రియాంకాగాంధీని కలిసిన సమయంలో స్రవంతి పేరునే సూచించినట్టు తెలిసింది. వెంకట్‌రెడ్డి కూడా సిఫారసు చేయడం, ప్రచారంలో వెనుకబడిపోతున్నామనే భావన నేపథ్యంలో.. ఇప్పుడే ప్రకటించడం మేలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందనే వార్తలు కూడా వస్తుండటంతో.. రెండు ప్రధాన పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ తమ
అభ్యర్థిని ప్రకటించిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment