
సాక్షి, కరీంనగర్: పల్నాటి యుద్ధాలతో ప్రఖ్యాతిగాంచిన నాయకురాలు నాగమ్మ. దాదాపు 900 ఏళ్ల క్రితమే మంత్రిగా పనిచేసి, తెలుగు పౌరుషానికి నిదర్శనంగా నిలిచిన ధీర వనిత. సంక్రాంతి పేరు చెప్పినా, కోడిపందాల ప్రస్తావన వచ్చినా.. తెలుగువారి మదిలో వెంటనే స్ఫురించేది ఆమె పేరే. ఆ వీర వనిత స్వస్థలం తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవెల్లిలో.. ఆమెకు గుడికట్టి దైవ స్వరూపంగా కొలుస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఆ పురాతన ఆలయాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. త్వరలోనే ప్రారంభిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో నాయకురాలు నాగమ్మను ఓసారి గుర్తు చేసుకుందాం.
బ్రహ్మనాయుడిని ఎదుర్కొని..
నాగమ్మది సంపన్న రైతు కుటుంబం. తండ్రి చౌదరి రామిరెడ్డి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన నాగమ్మకు ఏడేళ్ల వయసు ఉండగా.. జగిత్యాల ప్రాంతంలో మశూచి ప్రబలింది. దానితో పల్నాడులోని మేనమామ జగ్గారెడ్డి ఇంటికి పంపారు. అక్కడే యుద్ధవిద్యలు, సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యం సాధించింది. తన మనోధైర్యం, మేధస్సుతో పల్నాడును పాలించే నలగామరాజు కొలువులో మంత్రిగా చేరింది. మహిళలు ఇంట్లోంచి బయటికి కాలు పెట్టని కాలంలోనే.. మంత్రిగా ప్రతిభా పాటవాలు చూపింది. ఆ సమయంలోనే పల్నాడులో జరిగిన యుద్ధాల్లో బ్రహ్మనాయుడుతో తలపడింది.
బుద్ధికుశలతను, రాజనీతిజ్ఞతను ప్రదర్శించి.. పొరుగు రాజ్యాల సాయం పొందింది. ఇరువైపులా భారీగా ప్రాణనష్టం జరగడంతో కలత చెందిన బ్రహ్మనాయుడు తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్లిపోగా.. నాగమ్మ తన జన్మస్థలమైన ఆరవెల్లికి వచ్చింది. అక్కడ స్థానికులను ఇబ్బందిపెడ్తున్న బందిపోట్లను ఎదుర్కొంది. చుట్టుపక్కల గ్రామాల్లో యువతకు యుద్ధవిద్యల్లో శిక్షణ ఇచ్చి పోరాడేలా చేసింది. ఆ క్రమంలో అక్కడే కన్నుమూసింది. నాగమ్మ దైవ స్వరూపమని భావించిన స్థానికులు ఆమెకు గుడి కట్టించారు. ఇప్పటికీ శ్రావణమాసంలో ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించడానికి వందల ఏళ్ల ముందే.. నాగమ్మ తెలుగింటి కీర్తిని చాటిందని, ఆమెకు తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని చరిత్రకారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment