విచారణ జరుపుతున్న జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీతో పాటు స్థానికతను తప్పకుండా పరిగణించాలని జాతీయ బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను పాటించకపోవడం, విభజన ప్రక్రియ పూర్తికాకముందే కేటాయింపులు జరపడం వంటి అవకతవకలు జరిగాయంటూ పలువురు ఉద్యోగులు జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన కేటాయింపులను నిలిపివేయాలని కోరారు.
దీనిపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్ (ఎన్‌సీబీసీ) సోమవారం విచారణ చేపట్టింది. ఎన్‌సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో విచారణ సాగింది. పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హాజరు కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్ హాజరయ్యారు. విచారణ అనంతరం ఎన్‌సీబీసీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీ మాత్రమే కాకుండా వయసు, స్థానికతను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పదవీ విరమణకు దగ్గరున్న ఉద్యోగులను అక్కడే కొనసాగించాలన్నారు. అటవీ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగుల స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా వారిని మైదాన ప్రాంతాలకు, మైదాన ప్రాంతాల్లో పనిచేసే వారిని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయన్నారు.
ఉద్యోగుల వినతులను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్దేశించిన చోట చేరాలని బలవంతం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకముందే ఉద్యోగ కేటాయింపులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment