పాఠం చెప్పడమే పని.. | New Education Policy Passed Some Restrictions To Teachers | Sakshi
Sakshi News home page

పాఠం చెప్పడమే పని..

Published Fri, Jul 31 2020 3:37 AM | Last Updated on Fri, Jul 31 2020 3:44 AM

New Education Policy Passed Some Restrictions To Teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే పని.. వారే ఎన్నికల విధుల్లో అత్యధిక శాతం మంది ఉంటారు.. అవే కాదు స్కూళ్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు కూడా టీచర్లకే. రాష్ట్రంలో గత అనేక ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన కొత్త విద్యా విధానం మాత్రం టీచర్లు అవేవీ చేయకూడదని చెబుతోంది. టీచర్లకు ఆ పనులను అసలే చెప్పవద్దని స్పష్టం చేస్తోంది. అవే కాదు బోధనతో సంబంధం లేని ప్రభుత్వ పనులైనా సరే టీచర్లకు చెప్పవద్దని, పాలనా పరమైన వాటినీ అప్పగించవద్దని స్పష్టం చేస్తున్నా.. ఆచరణలో వాటి అమలే అసలు సమస్యగా మారనుంది.

2010 అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం కూడా బోధనతో సంబంధంలేని పనులను టీచర్లకు అప్పగించవద్దని చెప్పినా.. గత పదేళ్లలో అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. డిప్యుటేషన్‌ పేరుతో బోధనేతర పనుల్లో ఇప్పటికీ డీఈవో కార్యాలయాల్లో వందలమంది టీచర్లు కొనసాగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు విషయం కోర్టు వరకు వెళ్లాకే ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏలుగా ఉన్న వారిని తొలగించింది. ఇక మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు, ఆ లెక్కల బాధ్యతలు తమకు వద్దని టీచర్లు మొత్తుకుంటున్నా రాష్ట్రంలోని 28 వేల జిల్లా పరిషత్తు, ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో టీచర్లే వాటిని చూడాల్సి వస్తోంది.

బోధనకు తోడు అదనపు పనుల వల్ల బోధనకు ఆటంకం కలుగుతోందని టీచర్లు మొత్తుకుంటున్నా వారితోనే ఆ పనులను విద్యాశాఖ చేయిస్తోంది. లెక్కల్లో తేడాలు వచ్చి మెమోలు అందుకున్న టీచర్లు ఉన్నారు. కొత్త విద్యావిధానం  నేపథ్యం లో క్షేత్రస్థాయిలో ఆ నిబంధన ఎంతమేరకు విద్యాశాఖ అమలు చేస్తుందనేది తేలాల్సి ఉంది. కేంద్రం ఆశించినట్లుగా నాణ్యమైన విద్యా బోధన ఎంతమేరకు సాధ్యం అవుతుందన్నది కాలమే తేల్చనుంది. 

నిరంతరం వృత్తి నైపుణ్యాల అభివృద్ధి ప్రధానం.. 
టీచర్లు తమ వృత్తి పరమైన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని కూడా కొత్త విద్యా విధానం పేర్కొంది. ఇందుకోసం కంటిన్యుయస్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ (సీపీడీ) అమలు చేయాలంది. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సబ్జెక్టు వర్క్‌షాప్‌ల్లో పాల్గొనాలని పేర్కొంది. ఆన్‌లైన్లో అందుబాటులో ఉండే డెవలప్‌మెంట్‌ మాడ్యూల్స్‌ ప్రకారం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని అందులో టీచర్లు తమ అనుభవాలను పంచుకోవాలని, తద్వారా కొత్త విషయాలను నేర్చుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రతీ టీచర్‌ ఏటా కనీసంగా 50 గంటల సీపీడీ కార్యక్రమాల్లో పాల్గొనాలని వెల్లడించింది. 

బాగా పనిచేసే టీచర్లకు ప్రోత్సాహకాలు 
టీచర్ల కెరీర్‌ మేనేజ్మెంట్‌లో భాగంగా కీలక సంస్కరణలు చేసింది. బాగా పనిచేసే టీచర్ల పనికి గుర్తింపు ఇవ్వాలంది. అలాంటి వారికి పదోన్నతులివ్వడం, వేతనాలను పెంచడం వంటి చర్యలు చేపట్టాలంది. మిగతా టీచర్లు కూడా బాగా పని చేసేందకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. పదోన్నతులు, వేతన విధానాన్ని అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. టీచర్ల పని విధానాన్ని అంచనా వేసేందుకు పక్కాగా ఉండే విధానాన్ని రూపొందించాలని వెల్లడించింది. సమీక్ష, విద్యార్థుల అభిప్రాయాలు, హాజరు, కమిట్‌మెంట్, సీపీడీలో పాల్గొన్న గంటలు, ఇతర సేవ కార్యక్రమాలను కూడా ఇందులో పొందుపరచాలని వివరించింది. బాగా పనిచేసే టీచర్లకు అకడమిక్‌ లీడర్‌షిప్‌ ఇచ్చేందుకు వారికి తగిన శిక్షణ ఇవ్వాలంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement