ఫీజు వసూలు చేస్తేనే వేతనం | Corporate School Management Setting Targets To Teachers About Fees | Sakshi
Sakshi News home page

ఫీజు వసూలు చేస్తేనే వేతనం

Published Fri, Sep 4 2020 2:30 AM | Last Updated on Fri, Sep 4 2020 4:27 AM

Corporate School Management Setting Targets To Teachers About Fees - Sakshi

నవీన్‌కుమార్‌ పదేళ్లుగా ఎల్‌బీనగర్‌లోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో మ్యాథ్స్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ అనంతరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నాడు. విద్యార్థుల నుంచి టర్మ్‌ఫీజు వసూలు చేస్తేనే వేతనం ఇస్తామని యాజమాన్యం టార్గెట్‌ పెట్టింది. దీంతో నవీన్‌కుమార్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పైసా కూడా కట్టలేమని తల్లిదండ్రులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా నవీన్‌కుమార్‌కు 3 నెలలుగా యాజమాన్యం వేతనం ఇవ్వట్లేదు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లంతా ఇప్పుడిలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా వేతనాలందక సతమతమవుతున్నారు. వాస్తవానికి ప్రతి నెలా తొలి వారంలో అందే వేతనం.. జూలై నుంచి అందట్లేదు. జూన్, జూలై, ఆగస్టు నెలల వేతనాల గురించి యాజమాన్యాలను అడిగితే.. నిర్దేశించిన ఫీజు వసూలు టార్గెట్‌ పూర్తి చేయనందున ఇవ్వబోమని చెబుతున్నాయి. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు ఆన్‌లైన్‌ పాఠాల బోధనతో పాటు ఫీజు వసూలు బాధ్యతను కూడా అప్పగించాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తేనే నెలవారీ వేతనం చెల్లిస్తామని అంటున్నాయి. అయితే, కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పుడు ఫీజులు చెల్లించలేమని అంటున్నాయి. దీంతో టీచర్లకు వేతనాలందడం గగనమైపోయింది.

పని పెరిగినా జీతం నిల్‌
రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు 22 వేల వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు 2 లక్షల మంది బోధన సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సమాంతరంగా నడుస్తున్న ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. లాక్‌డౌన్, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు జూన్‌ ఒకటి నుంచే పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో బోధనను ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులే కీలకంగా వ్యవహరిస్తూ విద్యార్థులను సమన్వయç ³రుస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా పనిచేస్తున్నా.. వేతనానికి మాత్రం నోచుకోవట్లేదు.

ప్రతి క్లాస్‌ టీచర్‌కు టార్గెట్‌
ప్రైవేట్‌ స్కూళ్లలో ప్రతి తరగతికి ఒక టీచర్‌ను బాధ్యుడిగా ఉంచుతూ తరగతులు నడిపిస్తారు. ఆ తరగతి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే బాధ్యతను యాజమాన్యాలు ఈ క్లాస్‌ టీచర్లకే అప్పగించింది. జూన్‌ నుంచే తరగతులు ప్రారంభం కావడంతో మూడు నెలల ఫీజులు వసూలు చేయాలని, ఫస్ట్‌ టర్మ్‌ ఫీజులు వసూలు చేసిన వారికే నెలవారీ వేతనమిస్తామనే నిబంధన పెట్టాయి. ఈ టార్గెట్‌లో దాదాపు 70శాతం మంది టీచర్లు నూరు శాతం లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం బడులన్నీ మూసి ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు తెరవరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఈ క్రమంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేస్తే.. స్కూళ్లు తెరిచాకే చెల్లిస్తామనే బదులొస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా నిరుద్యోగం పెరగడం, చిన్నాచితకా వ్యాపారాలు దెబ్బతినడంతో ఇప్పుడు ఫీజులు చెల్లించలేమని చాలామంది చెబుతున్నారు. దీంతో యాజమాన్యాలు టీచర్ల వేతనాలకు ఎసరు పెడుతున్నాయి.

‘కార్పొరేట్‌’లో ఇచ్చేది సగం జీతమే..
ఇక, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు లక్ష్యాన్ని పూర్తిచేస్తే సగం జీతంతోనే సరిపెడుతున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తూ, ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ సగం జీతం ఇవ్వడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. సగం జీతం ఇవ్వడాన్ని బోధన, బోధనేతర సిబ్బంది తప్పుబడుతున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినా.. స్పందన కరువైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement