ట్యాపింగ్‌లో కదలిక! | New Information In The Phone Tapping Case That Created Sensation Across The State | Sakshi
Sakshi News home page

ట్యాపింగ్‌లో కదలిక!

Published Wed, May 29 2024 9:50 AM | Last Updated on Wed, May 29 2024 9:50 AM

New Information In The Phone Tapping Case That Created Sensation Across The State

కేసులో కీలక పరిణామం

ఎన్నికల సమయంలో కేవీఆర్, కొండల్‌రెడ్డిల ఫోన్ల ట్యాపింగ్‌

ఇంటెలిజెన్స్‌ ఏఎస్పీ వాంగ్మూలంలో మరిన్ని వివరాలు

మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం

నిజామాబాద్‌, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జిల్లాలోనూ ప్రకంపనలు వస్తున్నాయి. ప్రతిపక్షాల కదలికలను పసిగట్టి, చెక్‌ పెట్టడానికి గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటెలిజెన్స్‌ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ట్యాపింగ్‌కు సహకరించిన జిల్లాకు చెందిన అధికారులు, నాయకుల్లో గుబులు మొదలైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడినుంచి బరిలో నిలిచారు. రేవంత్‌రెడ్డి తరఫున ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకున్నారు. మరోవైపు బీజేపీ అభ్యరి్థగా కె.వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో వెంకటరమణారెడ్డి వైపు ఓటర్ల మొగ్గు ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుసుకుని బీజేపీతోపాటు కాంగ్రెస్‌లపైనా అప్పటి ప్రభుత్వం నిఘా పెట్టింది.

వెంకటరమణారెడ్డి, కొండల్‌రెడ్డిల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. కాగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఏఎస్పీ భుజంగరావు వాగ్మూలాన్ని సిట్‌ ఇటీవల రికార్డు చేసింది. బీఆర్‌ఎస్‌ను వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ పనిచేసినట్లు ఆయన అంగీకరించడం గమనార్హం. ఆయన కామారెడ్డి నియోజకవర్గంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాలనూ వెల్లడించినట్లు తెలిసింది.

హోటల్‌లో వార్‌ రూం.. 
ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ గ్యాంగ్‌ను కామారెడ్డికి పంపారని, ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను టార్గెట్‌ చేశారని ప్రాథమిక విచారణలో సిట్‌ గుర్తించింది. వార్‌ రూంను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరెవరి ఫోన్‌లు ట్యాపింగ్‌ చేశారు, ఎవరి పాత్ర ఏమిటనే పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు సేకరించి రెండు నెలల క్రితమే నివేదికను ‘సిట్‌’కు అందించినట్లు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహారాలపై నిఘా పెట్టడం కోసం కామారెడ్డికి వచ్చిన ట్యాపింగ్‌ గ్యాంగ్‌ జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ హోటల్‌లో నాలుగు గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.

అక్కడే వార్‌ రూంను ఏర్పాటు చేసి తమ కార్యకలాపాలను నడిపించారు. అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ చేయడం, ఆర్థిక మూలాలు, ఇతర విలువైన సమాచారాన్ని తెలుసుకుని అధికార పక్ష నేతలకు అందించడం లాంటివి చేశారని తెలుస్తోంది. వార్‌ రూం ఇన్‌చార్జీగా వ్వవహరిస్తూ, ఇక్కడకు వచ్చిన గ్యాంగ్‌కు అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పంచిన ముఖ్య నేతలు ఎవరు, ఇక్కడి అధికారులు ఎవరైనా సహకారం అందించారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని బీఆర్‌ఎస్‌ నేతలు, వారికి సహకరించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఆరోపణలకు బలం..
ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలకు బలం చేకూరేలా ఎన్నికల సమయంలో పలు సంఘటనలు చో టు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు మూడు రోజుల ముందు జిల్లా కాంగ్రెస్‌లో ముఖ్య నాయుకుడైన గూడెం శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయంపై అధికారులు దాడులు చేశారు. ఇందులో రూ.58 లక్షలు ప ట్టుబడ్డాయి. దేవునిపల్లి ప్రాంతంలో సీఎం రే వంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి నివాసం ఉన్న ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి.

ఆయనను గృహ నిర్భంధం కూడా చేశారు. అంతే కాకుండా విద్యానగర్‌కాలనీలో నివసించే ప్ర స్తుత మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇందుప్రియ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వా గ్వాదం కూడా జరిగింది. ఫోన్‌ ట్యాపింగ్‌తోనే వివరాలు తెలుసుకుని దాడులు చేశారని సిట్‌ విచారణలో తేలినట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement