తెరపైకి కొత్త మండలాలు? | New Mandals Formation Demand In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

తెరపైకి కొత్త మండలాలు?

Published Tue, Oct 6 2020 9:15 AM | Last Updated on Tue, Oct 6 2020 9:15 AM

New Mandals Formation Demand In Mahabubnagar District - Sakshi

సాక్షి, నారాయణపేట: పరిపాలన సౌలభ్యం.. ప్రజల డిమాండ్ల మేరకు మరోసారి కొత్త మండలాల ప్రస్తావన తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్‌ 2016లో విజయదశమిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు శ్రీకారం చుట్టి.. రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్యను 31కి పెంచారు. అయితే, జిల్లాతోపాటు పలు మండలాలను ఏర్పాటు చేయాలని ఉవ్వెత్తున ఉద్యమాలను జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగించారు. మరోసారి అవకాశం ఉంటే నారాయణపేటకు తొలి ప్రాధాన్యతనిస్తామని అప్పట్లో మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తరపున ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2018 ఎన్నికలు సమయంలో ప్రచారానికి నారాయణపేటకు వచ్చిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.రాజేందర్‌రెడ్డిని గెలిపిస్తే నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఫిబ్రవరి 17, 2019లో నారాయణపేట జిల్లాను 11 మండలాలతో ఏర్పాటు చేశారు. అంతకు ముందు జిల్లాల ఏర్పాటులో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఉద్యమంతో పాటు మండలాల ఉద్యమాలు కొనసాగాయి. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాలో ప్రస్తుతం అక్కడక్కడ కొత్త మండలాలు ఏర్పాటు అవుతుండడంతో నారాయణపేట జిల్లాలో సైతం కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో నారాయణపేట జిల్లాలో 11 నుంచి 13 మండలాలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రస్తుత మండలాలు ఇవే.. 
జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. అందులో నారాయణపేట నియోజవకర్గంలో నాలుగు మండలాలు మరికల్, ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గంలో మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, క్రిష్ణ మండలాలు, కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్‌ మండలాలు ఉన్నాయి.   

జిల్లాలో మళ్లీ రెండు మండలాలు ? 
జిల్లాలో మళ్లీ కొత్తగా రెండు మండలాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. నూతన రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావడంతో ప్రస్తుత సమయంలోనే కొత్త మండలాలకు ఏర్పాటు చేస్తే సరిపోతుందనే సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే ఉద్యమించిన ఉద్యమకారుల ఆశలు చిగురిస్తున్నాయి. అయితే రెండు మండలాల్లో ఇప్పటికే గ్రామ పంచాయతీల ద్వారా తీర్మాణాలను చేయించి ప్రతిపాదనలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. దసరా నాటికి  కొత్త మండలాలు ఏవి ఏర్పాటు అవుతాయో...లేదో వేచిచూడాల్సిందే మరి. 

కోటకొండను మండలంగా ప్రకటించాలి  
మండలంలోని కోటకొండను మండలం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సీపీఐ(ఎంఎల్‌)న్యూడమెమోక్రసీ  పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతూ కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి డీపీఓ మురళీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ.. నారాయణపేట పట్టణంలో 24 వార్డులు, మండలంలో 35 గ్రామాలు ఉన్నాయని, మండలంలోని కోటకొండని మండలం చేయడంతో పరిసర గ్రామాల ప్రజలకు పరిపాలన సౌలభ్యం అవుతుందని ఆకాంక్షించారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ కె.చంద్రారెడ్డి, జడ్పీ సీఈఓ కాళిందినికి వినతిపత్రాలను ఆందజేశారు. జడ్పీసీఈ మాట్లాడుతూ జడ్పీ సమావేశంలో పెట్టి తీర్మాణం చేసిపై అధికారులకు పంపిస్తామన్నారు.కార్యక్రమంలో కోటకొండ సర్పంచ్‌ విజయలక్షి్మ, ఎంపీటీసీ సునీత, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కాశీనాథ్, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు ప్రశాంత్, యాదగిరి, వెంక్‌రాములు, చెన్నారెడ్డి  పాల్గొన్నారు.

మరో రెండు..
కొత్త మండలాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ మండలాలను ఎక్కడ ఏర్పాటు చేస్తే సరిపోతుందనే సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ మండలాల్లో కొత్త మండలాలు చేయాలని 2016లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వాటిని  పరిశీలిస్తే కోస్గి మండలంలో గూండుమాల్, మద్దూర్‌ మండలంలోని కొత్తపల్లి, దామరగిద్ద మండలంలో కానుకుర్తి, నారాయణపేట మండలంలో నారాయణపేట ఆర్బన్, కోటకోండ, అప్పక్‌పల్లి, మక్తల్‌ మండలంలో కర్నే, జక్లేర్‌ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్‌ చేశారు. 

ఆదేశాలు రాలేదు 
కొత్త మండలాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించాలని తమకేమి ఆదేశాలు రాలేదు. – చీర్ల శ్రీనివాసులు,ఆర్డీఓ, నారాయణపేట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement