సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. వేరువేరు ప్రాంతాలకు చెందిన వీరు ఇరవై నాలుగు గంటల్లోనే మృతి చెందడంపై జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. కాగా ఈ మరణాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా గుర్తించాల్సి ఉంది. నవీపేట మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐకే ఫారానికి చెందిన బెజవాడ హరిబాబు (35), బోధన్‌లోని శక్కర్‌నగర్‌కు చెందిన మర్రి రాజేశ్వర్ (39), వేల్పూరు మండలం సాహెబ్‌పేట గ్రామానికి చెందిన ఉట్నూర్ చిన్న గంగారాం (65) హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
వారం రోజుల క్రితం నగరంలోని ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడడంతో హైదరాబాద్ వెళ్లి చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు సరస్వతినగర్‌లో స్కానింగ్ చేయడంతో ఈ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. వైద్యుడిని సంప్రదించగా ముక్కువద్ద ఇన్‌ఫెక్షన్ ఉండడం, నల్లటి చారలు కలిగి ఉండడంతో బ్లాక్ ఫంగస్‌గా గుర్తించి హైదరాబాద్ రిఫర్ చేశారు. అలాగే కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో నిజామాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఇలా ఒక్కొక్కటి కేసులు బయటపడుతున్నాయి.
వీరికే వచ్చే అవకాశం..
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నవారు ము ఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణా లు కనిపిస్తున్నాయి. షుగర్ అదుపులో లేకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఫంగస్ వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ తగ్గించేందుకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ అధికంగా వాడడంతో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది.
ఫంగస్ పంజా
బ్లాక్ ఫంగస్ జాడలు వెలుగు చూడటంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. ఇరవై నాలుగు గంటల్లోనే జిల్లాకు చెందిన ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరెంత మంది దీనిబారిన పడ్డారో స్పష్టత రావడం లేదు. ఈ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులను వైద్యులు హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.
లక్షణాలు..
బ్లాక్ ఫంగస్ సోకిన వారికి తలనొప్పి, ముక్కుదిబ్బడ, కంటిచూపు తగ్గడం, పంటినొప్పి, దవడనొప్పి, ఛాతినొప్పి, ముక్కునుంచి నల్లటి రక్తస్రావం రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. కంటి గుడ్డుకింద ఎర్రబడి దురదగా ఉండడం. ముక్కు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
అప్రమత్తత అవసరం..
జిల్లాలో ప్రస్తుతం 58,670 మంది కరోనా పాజిటివ్ లక్షణాలతో ఉన్నారు. ఇందులో రెండు వేల వరకు యాక్టివ్ కేసులున్నాయి. ఇటీవల పాజిటివ్ రేటు తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వెయ్యికి పైగా నమోదయ్యాయి. ఇందులో ఐసీయూలో చికిత్స పొందుతున్నవారే 500 మంది వరకూ ఉన్నారు. చికిత్స తీసుకుంటూ కరోనా తగ్గించుకున్నవారు కూడా ఉన్నారు. ఆస్పత్రుల్లో పది రోజుల వరకు చికిత్స పొందుతూ స్టెరాయిడ్లు వాడిన వారు, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందిన వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కేసులు వెలుగులోకి రావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసులను వైద్య శాఖ అధికారికంగా గుర్తించలేదు. వీటిపై విచారణ జరుగుతోంది. బ్లాక్ ఫంగస్ అవునా..కాదా అనే ది నిర్ధారించిన తర్వాతే స్పందిస్తామంటోంది.
తక్షణమే స్పందించాలి..
కరోనా సోకిన వారు చికిత్స అనంతరం శరీరంలో వచ్చే మార్పులను గమనించాలి. అధికంగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
– బి.రాజేశ్వర్, ఛాతి వైద్యనిపుణులు
Comments
Please login to add a commentAdd a comment