చౌకధరల దుకాణాల్లో పంచదార పంపిణీ ఊసేలేదు
కేవలం బియ్యం పంపిణీకే పరిమితం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పౌరసరఫరాల శాఖలో సబ్సిడీ చక్కెర చేదెక్కింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతీ నెల పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా పట్టింపు కరువైందని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులైన ఒక్కో యూనిట్‌కు 35 కిలోల బియ్యంతోపాటు ఒక కిలో చక్కెర తప్పనిసరిగా అందించాలి. కానీ గత కొంతకాలంగా లబ్ధిదారులకు చక్కెర పంపిణీ జరగడం లేదని చెపుతున్నారు. గత సర్కారు హయాం నుంచే చక్కెరను లబ్ధిదారులకు అందించడం నిలిపివేశారని సమాచారం. దీంతో లబ్ధిదారులు తప్పని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఒక కిలో పంచదారకు బహిరంగ మార్కెట్‌లో రూ.42 వరకు ధర ఉంది. అదే చౌకధరల దుకాణాల్లో సబ్సిడీతో రూ.13.50 చొప్పున అందించే అవకాశం ఉంది.
ఇందుకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఖర్చు భరిస్తోంది. చక్కెరను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సేకరించి సరఫరా చేయాలి. కానీ చక్కెర సరఫరా సక్రమంగా జరగక గత కొన్నేళ్లుగా కేవలం రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. గతంలో కొందరు డీలర్లు చక్కెర కోసం డీడీలు కట్టినా సరుకు రేషన్ షాపులకు చేరలేదు. దీంతో చాలామంది డీలర్లు చక్కెరను అడగడమే మానేశారు. కట్టిన డబ్బులు రాకపోవడంతో ఆయా డీలర్లు సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జిల్లాస్థాయి అధికారులు చొరవ తీసుకుంటున్న చోట్ల మాత్రమే చక్కెర పంపిణీ జరుగుతోందని చెపుతున్నారు.
రాష్ట్రంలో చౌకధరల దుకాణాల వివరాలు..
మొత్తం రేషన్ షాపులు :17,352
రేషన్ కార్డులు : 89,95,931
పంపిణీ చేస్తున్న బియ్యం: 1.79 లక్షల మెట్రిక్ టన్నులు
అంత్యోదయ కార్డులు : 5,66,845
పంపిణీ చేయాల్సిన చక్కెర: 566 మెట్రిక్ టన్నులు
అక్టోబర్‌లో చక్కెర కేటాయింపులు: 538 మెట్రిక్ టన్నులు
చక్కెర ఇవ్వాలి..
రేషన్ షాపుల్లో ప్రస్తుతం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ప్రతీ నెల తక్కువ ధరలో వచ్చే చక్కెర కూడా ఇస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది.
– కుమ్మరి బక్కక్క, మల్లంపేట,
కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment