
సాక్షి,హైదరాబాద్: భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా..అనేకమంది ద్విచక్రవాహనదారుల ప్రాణాలు పోతున్నా..లైట్ తీసుకుంటున్నారా? హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తున్నారా? ఆఫీసుకు ఆలస్యం అవుతోందని, ఏమవుతుందిలే.. చలానా కట్టేద్దాంలే అంటూ నిర్లక్ష్యంగా బైక్‌తో రోడ్డెక్కుతున్నారా? అయితే మీకు భారీ ఝలక్ తప్పదు. ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు.
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad@cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/AWbxWDLTZM
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 19, 2021
Comments
Please login to add a commentAdd a comment