నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతోంది. గత మూడు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇటీవల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించింది. గురుకులంలో ఉన్నప్పుడు ఈ సమస్య లేదని, ఇటీవలి కాలంలోనే ఇలా బాధపడుతోందని బాలిక తల్లి వైద్యురాలికి వివరించింది. ఆమెను పరీక్షించిన వైద్యురాలు వ్యక్తిగత పరిశుభ్రతపై హితోపదేశం చేశారు. నెలసరి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని, మందులు వాడాలని సూచించారు.
సాక్షి, హైదరాబాద్ : నిరుపేద విద్యార్థినులపై లాక్‌డౌన్, అనంతర పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రధానంగా గురుకుల పాఠశాలలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండే బాలికలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. విద్యాసంస్థలో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడు కొత్తగా ఎదురవ్వడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్, అనంతర పరిస్థితులు గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థినులపై ఎలాంటి ప్రభావం చూపాయనే అంశంపై పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, పీర్సన్ అనే సంస్థ హైదరాబాద్‌లోని మరో సంస్థ సహకారంతో అధ్యయనం చేశాయి. దాదాపు 3 వేల మంది విద్యార్థినులను నేరుగా, ఫోన్ ద్వారా ఇతర పద్ధతుల్లో సంప్రదించి వారి స్థితిని అంచనా వేశారు. ఈ క్రమంలో 68 శాతం మంది విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.
విద్యాసంస్థల్లో ప్రత్యేక శ్రద్ధ
గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో అధికారులు విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారి ఆరోగ్యస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. బాలికలకు అవసరమైన కాస్మొటిక్ కిట్లను ప్రతి నెలా ఇస్తారు. ఇందులో ప్రత్యేకంగా సానిటరీ ప్యాడ్స్ ఉంటాయి. వీటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండటం, వినియోగంపై అవగాహన కల్పించడంతో సరైన సమయంలో ఉపయోగించి జాగ్రత్తలు పాటించేవారు.
లాక్‌డౌన్‌తో హైజీన్ కిట్లకు దూరం
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో విద్యా సంస్థలు మూతబడ్డాయి. ఈ ఏడాది మార్చి నుంచి వీటిని పూర్తిగా మూసివేయడంతో విద్యార్థినులు వారి గ్రామాల్లోనే ఉండిపోయారు. ఇలా ఇంటి వద్ద ఆర్నెల్ల నుంచి ఉండటంతో వారికి పర్సనల్ హైజీన్ కిట్లు అందడం లేదు. నెలసరి సమయంలో సానిటరీ ప్యాడ్‌లు అందుబాటులో లేకపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో పలువురు బాలికలు పాత పద్ధతిలో గుడ్డలు వాడుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. జాగ్రత్తలు పాటించకపోవడంతో వారికి ఇన్ఫెక్షన్‌లు ఏర్పడి ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. 3 వేల మందిపై చేసిన పరిశీలనలో ఏకంగా 2 వేల మంది ఇలాంటి అనుభవాలనే చెప్పారని హైదరాబాద్‌కు చెందిన సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment