సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో శుక్ర కణాలు భారీ సంఖ్యలో తగ్గుతున్నాయి. వీర్యకణాల చిక్క దనం తగ్గిపోతోంది. నలభై ఐదేళ్ల కిందటి పరిస్థితులతో పోల్చితే...పురుషుల్లో వీర్యకణాల చిక్కదనంలో 50 శాతానికి పైగా, స్పెర్మ్‌కౌంట్ (శుక్ర కణాలు)లో 62.3% క్షీణత నమోదైనట్టు పేర్కొంటున్నాయి. తగ్గుదల రేటు గత కొన్నేళ్లుగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కాగా జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు కారణమని పరిశోధనలు స్పష్టం చే స్తున్నాయి. రాత్రివేళ పని, అధిక ఉష్ణోగ్రతలు, మారుతున్న అలవాట్లు ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 53 దేశాల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు.
ఏడాదికి 1.16% చొప్పున..!
1972 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఏడాదికి 1.16 శాతం చొప్పున శుక్రకణాల చిక్కదనంలో తగ్గుదల నమోదైనట్టు గుర్తించారు. ఇక 2000 సంవత్సరం తర్వాత సేకరించిన డేటాను మాత్రమే పరిశీలించినపుడు ఆ తగ్గుదల ఏడాదికి 2.64 శాతంగా ఉన్నట్టు తేలింది. దీనికి సంబంధించి తాజా పరిశోధన ‘హ్యుమన్ రీ ప్రొడక్షన్ అప్‌డేట్’ జర్నల్‌లో ప్రచురితమైంది. గతంలో వీర్యకణాల చిక్క దనం, కౌంట్ ఒక మిల్లీగ్రామ్ (ఎంఎల్)లో 40 మిలియన్ల కంటే తగ్గితే పునరుత్పత్తికి దోహదపడవని అంచనా వేశారు. అయి తే తాజా అంచనాలు, డేటా చూశాక దీని కంటే కూడా కౌంట్ పడిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగినట్టు స్పష్టమైంది.
పునరుత్పత్తి సామర్ధ్యంలో తగ్గుదల
స్పెర్మ్‌కౌంట్ తగ్గుదల జనాభా పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుదలను స్పష్టం చేస్తోందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జెరూసలెం హిబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ హగాయ్ లీవైన్ పేర్కొన్నారు. స్పెర్మ్‌కౌంట్ అనేది ‘హ్యుమన్ ఫెర్టిలిటీ’కే కాకుండా మగవారి ఆరోగ్యంతో ముడిపడిన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. వీర్యకణాల తగ్గుదల దీర్ఘకాలిక వ్యాధులకు, టెస్టిక్యూలర్ (వృషణాల) కేన్సర్లకు దారితీయడంతో పాటు ఆయురార్దం తగ్గుదలకూ దోహదపడుతుందని తేలింది. వయసు, శృంగార సామర్థ్యం ఇతర అంశాల ప్రాతిపదికగా వివిధ కేటగిరీలుగా విభజించి ఈ పరిశోధన నిర్వహించారు.
భారత్‌లో సుస్పష్టం
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో భాగంగా మన దేశంలోనూ దీనిపై పరిశీలన నిర్వహించారు. భారత్‌లో వివిధ కేటగిరీల వారీగా డేటా సేకరించారు. ‘భారత్‌లోని మగవారిలో శుక్రకణాల తగ్గుదల అనేది స్పష్టంగా గమనించాం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఒకేవిధమైన పరిస్థితి ఉంది. అత్యాధునిక సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, జీవనశైలి మార్పులు, పర్యావరణంలో రసాయనాల వ్యాప్తి వంటివి దీనికి ›ప్రధానకారణం’ అని లీవైన్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లోనూ తక్కువగా..
హైదరాబాద్ మహానగరంలో ఐటీతో పాటు వివిధరంగాల్లో ముఖ్యంగా రాత్రి పూట పనిచేసే వారిని, 30 ఏళ్లు ఆ పై వయసు పైబడ్డాక పెళ్లి చేసుకున్న వారిని, జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్న రోగుల్ని డాక్టర్లు పరిశీలించారు. వారికి తగిన పరీక్షలు చేసి, పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలపై ట్రీట్‌మెంట్ ఇచ్చారు.
►పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత 32 ఏళ్ల వయసున్న సురేష్ కుమార్, 30 ఏళ్ల వయసున్న లక్ష్మీ (పేర్లు మార్చాం) తమకు పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ వద్దకు వెళ్లారు. వారికి ఇన్‌ఫెర్టిలిటీ ఎవల్యూయేషన్ చెకప్‌లు నిర్వహించారు. ఇందులో భాగంగా వారికి విడివిడిగా క్లినికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్‌లు నిర్వహించి సెమన్ అనాలిసిస్‌కు (వీర్యకణాల విశ్లేషణ) పంపించారు. సురేష్‌లో శుక్రకణాలు ఉండాల్సిన దాని కంటే చాలా తక్కు వగా ఉన్నట్టు ‘వలిగొ స్పెర్మటోజువా’ ద్వారా గుర్తించారు. జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. సరైన సమయానికి ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు, సరైన నిద్ర, ఒత్తిళ్లను దూరం చేసే విధానాలు, తగిన వ్యాయామం వంటి వాటితో గణనీయమైన మార్పులు సాధించవచ్చునని సూచించారు.
►29 ఏళ్ల వెంకటేశ్వరరావు (పేరు మార్చాం)కు రెండేళ్ల క్రితమే పెళ్లి అయినా పిల్లలు పుట్టలేదు. ఇతను ప్రతిరోజూ రాత్రి 10, 11 గంటల దాకా వ్యాపారరీత్యా పనిలోనే ఉంటారు. ఆ తర్వాత అలసటకు గురికావడం, ఆలస్యంగా తిండి తిన డం, నిద్రపోవడం వల్ల వీర్యకణాలు అవసరమైన వాటికంటే చాలా తక్కువగా ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ముఖ్యమని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నందువల్ల వీలైనంత మేర ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఎక్కువగా..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. మిగతా వారితో పోల్చితే 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటున్నవారిలో వీర్యకణాల కౌంట్ బాగా తక్కువగా ఉంటోంది. వీరు నైట్ డ్యూటీల్లో పనిచేస్తుండడం, ఆహార అలవాట్లు మారడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతూకం కోల్పోయి మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో స్పెర్మ్‌కౌంట్ తగ్గడాన్ని మా పరిశీలనల్లో గమనించాం. ఒకవేళ కౌంట్ కావాల్సినంత ఉన్నా చురుకైన కదలికలు లేని వీర్యకణాలే ఎక్కువగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండడం లేదు.
– డా.కేవీ భార్గవ్‌రెడ్డి, మంగళగిరి ఎయిమ్స్.
ఒత్తిళ్లు..ఊబకాయం
అన్ని రంగాలు, వర్గాలకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య జీవితం గడుపుతున్నారు. జంక్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. 30 ఏళ్లలోపు వారికే షుగర్, బీపీ వస్తున్నాయి. దీనివల్ల రానురాను ఇన్‌ఫెర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లో, బయటా, పనిప్రదేశాల్లో వివిధ రూపాల్లో రేడియేషన్, యూవీ రేస్, కాలుష్య ప్రభావాలు పెరిగిపోయి కావాల్సిన సంఖ్యలో వీర్యకణాల ఉత్పత్తి జరగడం లేదు.
– డా.ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment