సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కొలువు కోసం కలలుకంటున్న యువత కీలక ‘పరీక్ష’కు సమయం ఆసన్నమైంది. శనివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఎస్సై తుదిరాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సివిల్ ఎస్సై, కమ్యూనికేషన్ ఎస్సై, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ తుది రాతపరీక్షకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్పీఆర్బీ) పకడ్బందీగా చర్యలు చేపట్టింది.
అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రాథమిక రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షల సమయంలో నమోదైన వేలిముద్రలతో సరిపోలితేనే పరీక్షకు అనుమతిస్తారు. ఒకరికి బదులు వేరొక అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకత కోసం ఈ విధానాన్ని పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గత రెండు రిక్రూట్‌మెంట్ల నుంచి అమల్లోకి తెచ్చారు.
అభ్యర్థులు చేతులకు మెహందీ(గోరింటాకు), టాటూలు వేసుకోవద్దని, వాటి కారణంగా బయోమెట్రిక్ హాజరులో ఇబ్బంది తలెత్తితే పరీక్షకు అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి విధిగా హాల్‌టికెట్ ఏ 4 సైజులో ప్రింటవుట్ తీసుకోవడంతోపాటు దానిలో సూచించిన ప్రాంతంలో పాస్‌పోర్ట్ సైజు ఫొటో(ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసింది) అతికించి తేవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో అతికించకుండా వచ్చే అభ్యర్థులను పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ...
సివిల్ ఎస్సై పోస్టుకు 1,01,052 మంది, కమ్యూనికేషన్ ఎస్సై పోస్టుకు 11,151 మంది, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సైకి 2,762 మంది, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుకు 4,820 మంది పార్ట్–2 దరఖాస్తులు(తుది రాతపరీక్ష కోసం దరఖాస్తు) పూర్తి చేశారు. వీరంతా శని, ఆదివారాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ల్లో జరిగే తుది రాతపరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
పూర్తి సాంకేతికత.. పక్కాగా ఏర్పాట్లు
లక్షకుపైగా యువత నెలలుగా తుది రాతపరీక్షకు సన్నద్ధమయ్యారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పక్కాగా ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు పోలీస్ నియామక మండలి పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు.
పరీక్షకేంద్రాల్లో అవసరమైనచోట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షపత్రాల లీకేజీల నేపథ్యంలో ఎస్సై తుది రాతపరీక్షలో పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షకేంద్రాలున్న హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలున్నాయి: డీజీపీ
ఎస్సై తుది రాత పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, చాలా రూట్లలో శనివారం ఉదయం 8–30 నుంచి 10–30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకునేలా జాగ్రత్తపడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment