దశాబ్దాలుగా బీబీనగర్–గుంటూరు లైన్ డబ్లింగ్‌ను పట్టించుకోని రైల్వే
కాజీపేట–విజయవాడ గ్రాండ్ ట్రంక్ రూట్‌కు ప్రత్యామ్నాయమైన ఈ మార్గం అభివృద్ధిపై నిర్లక్ష్యం
ఇటీవల కేసముద్రం వద్ద ట్రాక్ కొట్టుకుపోయిన రూట్ ‘గ్రాండ్ ట్రంక్’లో భాగమే.. ఆ ట్రాక్‌ను పునరుద్ధరించేలోగా బీబీనగర్ మార్గంలోకి మళ్లింపు
సింగిల్ లైన్ కావడంతో వందల రైళ్లను రద్దు చేసిన అధికారులు.. డబ్లింగ్ పనులే పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఉత్తర–దక్షిణాదిని కలిపే కీలక రైలుమార్గం గ్రాండ్ ట్రంక్ రూట్. కన్యాకుమారి నుంచి కశీ్మర్‌ను జోడించే ప్రధాన లైన్ ఇది. ఎగువ రాష్ట్రాల రైళ్లు బల్లార్షా ద్వారా వచ్చి కాజీపేట–ఖమ్మం–విజయవాడ మీదుగా దక్షిణ భారత్‌లోకి ప్రవేశిస్తాయి. ఒడిశా తదితర తీరప్రాంతాల నుంచి మరో మార్గం మీదుగా విజయవాడ వచ్చి అక్కడి నుంచి దక్షిణాదిలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ దానితో పోలిస్తే కాజీపేట మీదుగా వెళ్లేదే ప్రధాన మార్గం. ఈ మార్గం ద్వారా నిత్యం దాదాపు 400 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
అలాంటి కీలక మార్గంలోనే ఇటీవల అవరోధం ఏర్పడింది. కేసముద్రం మార్గంలో ట్రాక్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల నుంచి గ్రాండ్ ట్రంక్ రూట్ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను విజయవాడ మీదుగా హౌరా మార్గం నుంచి, మరికొన్నింటిని నిజామాబాద్ మార్గం మీదుగా నాగ్‌పూర్ నుంచి నడిపారు. కానీ ఆ మార్గాలన్నీ కిక్కిరిసి ఉండటం వల్ల మూడు రోజుల వ్యవధిలో 357 రైళ్లను రద్దు చేయాల్సి వచి్చంది. అదే ఒకవేళ ట్రాక్ కొట్టుకుపోయిన ప్రాంతం నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉండి ఉంటే ఈ అవస్థలన్నీ తప్పేవి.
ఆ మార్గం డబ్లింగ్ అయ్యుంటే..: సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి వద్ద నడికుడి–గుంటూరు లైన్ మొదలవుతుంది. ఇది గుంటూరు మీదుగా విజయవాడకు అనుసంధానమవుతుంది. కాజీపేట–విజయవాడ గ్రాండ్ ట్రంక్ రూట్‌కు స్థానికంగా ఇది ప్రత్యామ్నాయ మార్గమే. ఈ మార్గంలో గుంటూరు–మాచర్ల సెక్షన్ 1930లో ప్రారంభమైంది. బీబీనగర్–నడికుడి మధ్య 1974లో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. క్రమంగా ఇది కీలకంగా మారింది. కానీ ఆ మార్గంలో రెండో లైన్ నిర్మించాల్సి ఉన్నా రైల్వేశాఖ దృష్టి సారించలేదు. మూడు దశాబ్దాలుగా డబ్లింగ్ కోసం ఒత్తిడి పెరిగినా ఆ ప్రాజెక్టును మంజూరు చేయలేదు. సామర్థ్యానికి మించి 200 శాతంతో అవి నడుస్తున్నాయి. గ్రాండ్ ట్రంక్ రూట్‌కు ప్రత్యామ్నాయమే అయినప్పటికీ భారీ రద్దీతో ఆ మార్గం ఉపయోగపడకుండా పోయింది. కేసముద్రం వద్ద ట్రాక్ కొట్టుకుపోవడంతో నడికుడి మార్గంలో గూడ్సు రైళ్లను ఆపి కొన్ని రైళ్లను మాత్రమే మళ్లించగలిగారు.
ఎట్టకేలకు టెండర్లు..: 248 కి.మీ. ఈ మార్గంలో డబ్లింగ్ పనులు చేపట్టేందుకు గత బడ్జెట్‌లో కేంద్రం తొలిసారి రూ. 200 కోట్లను కేటాయించడంతో ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇది గ్రాండ్ ట్రంక్ రూట్‌కు కీలక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడనుంది.
దాదాపు 16 ఏళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా ఉమ్మడి
⇒ వరంగల్ జిల్లా డోర్నకల్ సమీపంలోని గుండ్రాతిమడుగు వద్ద రైల్వేట్రాక్ కొట్టుకుపోయింది. దాన్ని పునరుద్ధరించేందుకు 3–4 రోజులు పట్టడంతో రైళ్ల దారిమళ్లింపు కష్టంగా మారింది.
⇒ ఈ నెల 1న భారీ వర్షాలు, వరదలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం–ఇంటికన్నె మధ్య రైల్వేట్రాక్ కొట్టుకుపోవడంతో రెండు రోజులపాటు ఉత్తర, దక్షిణాదిని కలిపే గ్రాండ్ ట్రంక్ రూట్‌లో వందలాది రైళ్లను రద్దు చేయాల్సి వచి్చంది.
⇒ ఈ మార్గానికి ప్రత్యామ్నాయమైన బీబీనగర్–గుంటూరు లైన్ డబ్లింగ్ చేయాలని దశాబ్దాలుగా కోరుతున్నా రైల్వేశాఖ పట్టించుకోలేదు. రైల్వే శాఖ అప్పుడే గుణపాఠం నేర్చుకొని డబ్లింగ్ పనులు చేపట్టి ఉంటే ఇటీవల వరదలప్పుడు రైళ్ల రాకపోకలకు సమస్యలు తప్పి ఉండేవి.
Comments
Please login to add a commentAdd a comment