PM SHRI Scheme: ఇక 'బడి' జిటల్‌ | Officials Proposed 1200 Schools-From-Telangana For PM SHRI Scheme | Sakshi
Sakshi News home page

PM SHRI Scheme: ఇక 'బడి' జిటల్‌

Published Mon, Jan 9 2023 3:56 AM | Last Updated on Mon, Jan 9 2023 9:35 AM

Officials Proposed 1200 Schools-From-Telangana For PM SHRI Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మౌలిక వసతులు కల్పించి సాంకేతిక సొబగులతో ప్రభుత్వ పాఠశాలవిద్యను తీర్చి దిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పథకానికి తెలంగాణ నుంచి 1,200 స్కూళ్లను అధికారులు ప్రతిపాదించారు. ఒకవైపు ఆహ్లాదకర వాతావరణం, మరోవైపు ఆధునికపద్ధతుల్లో బోధన ఉంటే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన. గ్రామస్థాయి విద్యార్థులకు కూడా జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను అందుబాటులోకి తేవచ్చని, విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టి, ఉపాధి మార్గాలకు పాఠశాల దశలోనే పునాదులు వేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందించనుంది.  

మౌలిక సదుపాయం.. మరింత సాయం 
పీఎంశ్రీ కింద ఎంపికైన బడుల్లో సొంత భవనాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, సౌరవిద్యుత్‌ ఏర్పాటు, కాయగూరల తోట ఏర్పాటు, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడం, శుద్ధజలం, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) ల్యాబ్, డిజిటల్‌ గ్రంథాలయం, క్రీడలకు ప్రోత్సాహం, నాణ్యమైన విద్యతోపాటు అంతర్జాల సదుపాయం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ, వృత్తివిద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి వంటివాటికి ఈ నిధులను వాడుకోవచ్చని కేంద్రం పేర్కొంది. స్కూల్‌ దశ నుంచే ఒకేషనల్‌ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చేసరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్న జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఈ పథకాన్ని తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.  

యూడైస్‌ డేటానే ప్రామాణికం 
ప్రతీ పాఠశాల సమాచారాన్ని డ్రిస్టిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌(యూడైస్‌ ప్లస్‌)లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగానే పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేస్తారు. యూడైస్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన విధానాలు, కొన్నేళ్లుగా టెన్త్‌లో వస్తున్న గ్రేడ్లు, ఇతర క్లాసుల్లో వస్తున్న విద్యార్థుల మార్కుల వివరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సహకారం, అందుతున్న నిధులతోపాటు ఆ స్కూల్‌కు కావాల్సిన అదనపు గదులు, చేయాల్సిన మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల సమాచారాన్ని పొందుపరుస్తారు.  

స్థానిక సంస్థల ఆమోదం తప్పనిసరి 
పీఎంశ్రీ పథకం ఆమోదానికి స్థానిక సంస్థల ప్రతినిధుల ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఓ కమిటీ పరిశీలిస్తుంది. పథకంలో చేరేందుకు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులు, నిధుల వినియోగంపై ఆజమాయిషీకిగాను అవసరమైన కమిటీ ఏర్పాటును గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిగ్రామాల్లో రాజకీయకోణంలో దీనిపై ఇప్పటికీ సర్పంచ్‌లు స్పష్టత ఇవ్వలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. వారికి అవగాహన కలి్పంచి, పాఠశాలల పురోభివృద్ధికి తోడ్పడేలా చూడాలని కేంద్ర విద్యాశాఖ అన్నిరాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చే ఏప్రిల్‌ నుంచి ఈ పథకం ద్వారా నిధులు అందే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.  

ప్రయోగాలు.. వర్చువల్‌ రియాలిటీ ద్వారా అవగాహన 
పీఎంశ్రీ పాఠశాలల డిజిటలైజేషన్‌లో భాగంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా అన్నిప్రాంతాల నుంచి ఫ్యాకలీ్టని అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర విద్యాశాఖ ఆలోచన. దీనివల్ల గ్రామస్థాయి విద్యార్థులకు జాతీయస్థాయి విద్యాప్రమాణాలు అందుతాయని భావిస్తోంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రయోగాలు, సోషల్‌లో భౌగోళిక స్థితిగతులు వర్చువల్‌ రియాలిటీలో విద్యార్థులకు అవగాహన కలి్పంచాలని అధికారులు భావిస్తున్నారు. ఉదాహరణకు మొక్క ఆవిర్భావం దగ్గర్నుంచి, దాని ఎదుగుదల దశలను వర్చువల్‌ పద్ధతిలో విద్యార్థి క్లాస్‌రూం నుంచే తెలుసుకునే వెసులుబాటు కలి్పస్తారు. గ్రహాలు, సూర్య, చంద్రమండలాల్లో మార్పులను ఆధునిక సాంకేతికతతో అర్థమయ్యేలా చెబుతారు.

రాష్ట్రం వాటా 40% 
పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులను కేటాయించనున్నాయి. ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తూ, టీచర్లు తగిన నిష్పత్తిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14,500 పాఠశాలలను వివిధ ప్రమాణాల ద్వారా గుర్తించారు. అయితే ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలు సాధిస్తున్న ప్రగతి, మెరుగైన ఫలితాల గురించిన పర్యవేక్షణ బాధ్యత మాత్రం కేంద్ర విద్యామంత్రిత్వశాఖదే.

మూడు దశల్లో పాఠశాలల స్క్రీనింగ్‌ 
పీఎంశ్రీ పథకం కింద పాఠశాలలను ఎంపిక చేయడానికి మూడు దశల స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుంది. మొదటిదశలో స్కూల్‌లో టెన్త్, ఇతర క్లాసులకు సంబంధించిన కొన్నేళ్ల ఫలితాలు అప్‌లోడ్‌ చేశాం. పాఠశాలకు కావాల్సిన నిధులు, మౌలిక వసతుల గురించిన సమాచారారాన్ని యూడైస్‌ ద్వారా తెలిపాం. మొదటిదశలో మా స్కూల్‌ ఎంపికైంది. ఇటీవల అధికారులు వచ్చి పరిశీలించారు. మూడోదశలో జిల్లా అధికారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మా స్కూల్‌లో 580 మంది ఉన్నారు. గతేడాది 80 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యారు. నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ గత నాలుగేళ్లల్లో 48 మందికి లభించాయి. పీఎంశ్రీ కింద భారీగా నిధులొస్తే స్కూల్‌లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుంది. ఫలితంగా ప్రతిభకు మరింత పదును పెట్టవచ్చు.  
 – ఆకుల పద్మలత, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

ఐదు వేల పాఠశాలల వివరాలు పంపాం 
కేంద్రం తీసుకొస్తున్న పీఎంశ్రీ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకు తోడ్పడుతుంది. అనేక ప్రామాణిక అంశాల ఆధారంగా రాష్ట్రంలో 5 వేల పాఠశాలల వివరాలను అడిగారు. ఇవన్నీ పంపాం. 1,200 స్కూల్స్‌ పీఎంశ్రీ పరిధిలోకి వస్తాయని ఆశిస్తున్నాం. వీలైనంత త్వరలోనే ఈ పథకం అమలులోకి వస్తుందనే విశ్వాసం ఉంది.  
– వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement