e learning
-
AP: ఇక ‘ఈ–పాఠశాల’.. విద్యా రంగంలో మరో విప్లవాత్మక ముందడుగు
సాక్షి, అమరావతి: విప్లవాత్మక సంస్కరణలతో విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే బైజూస్ ద్వారా స్మార్ట్ ఫోనుల్లో, ట్యాబుల్లో ఈ–కంటెంట్ అందిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి ఈ–పాఠశాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్‌ను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్ విద్యాబోధన అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతులకు అవసరమైన ఈ–కంటెంట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీఈఆర్టీ ద్వారా 4వ తరగతి నుంచి ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ–కంటెంట్‌ను రూపొందించే పనిలో ఎస్సీఈఆర్టీ నిమగ్నమైంది. ప్రస్తుతం 4వ తరగతి నుంచి నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు బైజూస్ సంస్థ ద్వారా కంటెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎస్సీఈఆర్టీ అదే తరహాలో ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో కూడా రూపొందిస్తోంది. పాఠ్యప్రణాళికలను రూపొందించేది ఎస్సీఈఆర్టీయే కాబట్టి భవిష్యత్తులో బైజూస్ సంస్థ ఉన్నా, లేకున్నా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ ద్వారా ఈ– కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. దీన్ని ఏపీ ఈ–పాఠశాల, యూట్యూబ్, దీక్షా ప్లాట్ఫారం, ఐఎఫ్బీ ప్లాట్ఫారం, పీఎం ఈ–విద్య (డీటీహెచ్ చానెల్)లో అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఒకే రకమైన కంటెంట్ ఉండేలా.. ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరికి నచ్చినట్లు వారు ఈ–కంటెంట్‌ను రూపొందించి యూట్యూబ్‌లో పెడుతున్నారు. దీనివల్ల విద్యార్థులు కొంత సంశయానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే అన్ని అధికారిక చానెళ్లలో ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ రూపొందించిన ఈ–కంటెంట్‌ను అందుబాటులో ఉంచనుంది. బైజూస్ ఈ–కంటెంట్ ఉన్నా.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందుబాటులో ఉంది. అయితే ఇది నాన్ లాంగ్వేజెస్ (మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్)కు మాత్రమే పరిమితమైంది. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈ–కంటెంట్‌ను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించింది. వీరు 10వ తరగతి వరకు ఈ–కంటెంట్ పాఠ్యాంశాలను ట్యాబుల్లోనే చదువుకోవచ్చు. అయితే బైజూస్ ద్వారా లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఈ–కంటెంట్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌ఈసీఆర్‌టీ) ద్వారా లాంగ్వేజ్ సబ్జెక్టులకు (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) కూడా ప్రభుత్వం ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా ముందు 8వ తరగతిలో లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఈ–కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను చేపట్టిన ఎస్సీఈఆర్టీ మరో రెండు నెలల్లో దీన్ని పూర్తి చేయనుంది. ఆ తర్వాత వరుసగా 9, 7, 6 తరగతులకు రూపొందిస్తారు. 10వ తరగతికి 2024–25లో సిలబస్ మారుస్తామని.. ఆ తర్వాత ఈ–కంటెంట్‌ను రూపొందిస్తామని ఎస్సీఈఆర్టీ అధికారులు వివరించారు. వచ్చే ఏడాది నాటికి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు అనుగుణంగానే పాఠ్యాంశాలు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ పాఠ్యాంశాలు ఉండేలా ఎస్సీఈఆర్టీ చర్యలు చేపట్టింది. కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే విద్యార్థి నేర్చుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో వెనుకబడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి పరీక్షలన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అలాంటి పరీక్షల్లోనూ మంచి విజయాలు సాధించేలా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ఈ–కంటెంట్ రూపకల్పనలో యథాతథంగా అనుసరిస్తున్నారు. జాతీయ కరిక్యులమ్‌ను అనుసరించి జాతీయ అంశాలను బోధించేటప్పుడు మన రాష్ట్ర అంశాలను ఆసరాగా చేసుకొని చెప్పేలా టీచర్లకు సూచనలు సైతం చేశారు. చదవండి: ఇంటింటా జన నీరాజనం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభం -
PM SHRI Scheme: ఇక 'బడి' జిటల్
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతులు కల్పించి సాంకేతిక సొబగులతో ప్రభుత్వ పాఠశాలవిద్యను తీర్చి దిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకానికి తెలంగాణ నుంచి 1,200 స్కూళ్లను అధికారులు ప్రతిపాదించారు. ఒకవైపు ఆహ్లాదకర వాతావరణం, మరోవైపు ఆధునికపద్ధతుల్లో బోధన ఉంటే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన. గ్రామస్థాయి విద్యార్థులకు కూడా జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను అందుబాటులోకి తేవచ్చని, విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టి, ఉపాధి మార్గాలకు పాఠశాల దశలోనే పునాదులు వేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందించనుంది. మౌలిక సదుపాయం.. మరింత సాయం పీఎంశ్రీ కింద ఎంపికైన బడుల్లో సొంత భవనాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, సౌరవిద్యుత్ ఏర్పాటు, కాయగూరల తోట ఏర్పాటు, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడం, శుద్ధజలం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ల్యాబ్, డిజిటల్ గ్రంథాలయం, క్రీడలకు ప్రోత్సాహం, నాణ్యమైన విద్యతోపాటు అంతర్జాల సదుపాయం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ, వృత్తివిద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి వంటివాటికి ఈ నిధులను వాడుకోవచ్చని కేంద్రం పేర్కొంది. స్కూల్ దశ నుంచే ఒకేషనల్ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చేసరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్న జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఈ పథకాన్ని తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. యూడైస్ డేటానే ప్రామాణికం ప్రతీ పాఠశాల సమాచారాన్ని డ్రిస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్ ప్లస్)లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగానే పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేస్తారు. యూడైస్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన విధానాలు, కొన్నేళ్లుగా టెన్త్‌లో వస్తున్న గ్రేడ్లు, ఇతర క్లాసుల్లో వస్తున్న విద్యార్థుల మార్కుల వివరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సహకారం, అందుతున్న నిధులతోపాటు ఆ స్కూల్‌కు కావాల్సిన అదనపు గదులు, చేయాల్సిన మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల సమాచారాన్ని పొందుపరుస్తారు. స్థానిక సంస్థల ఆమోదం తప్పనిసరి పీఎంశ్రీ పథకం ఆమోదానికి స్థానిక సంస్థల ప్రతినిధుల ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఓ కమిటీ పరిశీలిస్తుంది. పథకంలో చేరేందుకు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులు, నిధుల వినియోగంపై ఆజమాయిషీకిగాను అవసరమైన కమిటీ ఏర్పాటును గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిగ్రామాల్లో రాజకీయకోణంలో దీనిపై ఇప్పటికీ సర్పంచ్‌లు స్పష్టత ఇవ్వలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. వారికి అవగాహన కలి్పంచి, పాఠశాలల పురోభివృద్ధికి తోడ్పడేలా చూడాలని కేంద్ర విద్యాశాఖ అన్నిరాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ పథకం ద్వారా నిధులు అందే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రయోగాలు.. వర్చువల్ రియాలిటీ ద్వారా అవగాహన పీఎంశ్రీ పాఠశాలల డిజిటలైజేషన్లో భాగంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అన్నిప్రాంతాల నుంచి ఫ్యాకలీ్టని అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర విద్యాశాఖ ఆలోచన. దీనివల్ల గ్రామస్థాయి విద్యార్థులకు జాతీయస్థాయి విద్యాప్రమాణాలు అందుతాయని భావిస్తోంది. సైన్స్ సబ్జెక్టుల్లో ప్రయోగాలు, సోషల్‌లో భౌగోళిక స్థితిగతులు వర్చువల్ రియాలిటీలో విద్యార్థులకు అవగాహన కలి్పంచాలని అధికారులు భావిస్తున్నారు. ఉదాహరణకు మొక్క ఆవిర్భావం దగ్గర్నుంచి, దాని ఎదుగుదల దశలను వర్చువల్ పద్ధతిలో విద్యార్థి క్లాస్‌రూం నుంచే తెలుసుకునే వెసులుబాటు కలి్పస్తారు. గ్రహాలు, సూర్య, చంద్రమండలాల్లో మార్పులను ఆధునిక సాంకేతికతతో అర్థమయ్యేలా చెబుతారు. రాష్ట్రం వాటా 40% పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులను కేటాయించనున్నాయి. ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తూ, టీచర్లు తగిన నిష్పత్తిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14,500 పాఠశాలలను వివిధ ప్రమాణాల ద్వారా గుర్తించారు. అయితే ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలు సాధిస్తున్న ప్రగతి, మెరుగైన ఫలితాల గురించిన పర్యవేక్షణ బాధ్యత మాత్రం కేంద్ర విద్యామంత్రిత్వశాఖదే. మూడు దశల్లో పాఠశాలల స్క్రీనింగ్ పీఎంశ్రీ పథకం కింద పాఠశాలలను ఎంపిక చేయడానికి మూడు దశల స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. మొదటిదశలో స్కూల్లో టెన్త్, ఇతర క్లాసులకు సంబంధించిన కొన్నేళ్ల ఫలితాలు అప్లోడ్ చేశాం. పాఠశాలకు కావాల్సిన నిధులు, మౌలిక వసతుల గురించిన సమాచారారాన్ని యూడైస్ ద్వారా తెలిపాం. మొదటిదశలో మా స్కూల్ ఎంపికైంది. ఇటీవల అధికారులు వచ్చి పరిశీలించారు. మూడోదశలో జిల్లా అధికారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మా స్కూల్లో 580 మంది ఉన్నారు. గతేడాది 80 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్స్ గత నాలుగేళ్లల్లో 48 మందికి లభించాయి. పీఎంశ్రీ కింద భారీగా నిధులొస్తే స్కూల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుంది. ఫలితంగా ప్రతిభకు మరింత పదును పెట్టవచ్చు. – ఆకుల పద్మలత, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదు వేల పాఠశాలల వివరాలు పంపాం కేంద్రం తీసుకొస్తున్న పీఎంశ్రీ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకు తోడ్పడుతుంది. అనేక ప్రామాణిక అంశాల ఆధారంగా రాష్ట్రంలో 5 వేల పాఠశాలల వివరాలను అడిగారు. ఇవన్నీ పంపాం. 1,200 స్కూల్స్ పీఎంశ్రీ పరిధిలోకి వస్తాయని ఆశిస్తున్నాం. వీలైనంత త్వరలోనే ఈ పథకం అమలులోకి వస్తుందనే విశ్వాసం ఉంది. – వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
గ్రేట్ లెర్నింగ్.. ఇకపై బైజూస్ ఆధ్వర్యంలో
ఇండియాలో మోస్ట్ పాపులర్ ఎడ్యుకేషనల్ యాప్‌గా పేరొందిన బైజూస్ తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటి వరకు అకడామిక్ ఓరియెంటెండ్ సర్వీసెస్‌పై ఎక్కువగా ఫోకస్ చేయగా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్, సర్టిఫికేట్ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. అందులో భాగంగా గ్రేట్లెర్నింగ్ను స్వంతం చేసున్నట్టు ప్రకటించింది. బిలియన్ డాలర్లు ఉన్నత విద్యకు సంబంధఙంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న గ్రేట్ లెర్నింగ్‌ను బైజూస్ సొంతం చేసుకోనుంది. సుమారు 600 మిలియన్ డాలర్లతో గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేసింది. అంతేకాదు హైయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన సెగ్మెంట్లో భారీగా విస్తరించేందుకు మరో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. మొత్తంగా ఉన్నత విద్య, కెరీర్ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో వన్ బిలియన్ డాలర్ల పెట్టుబడికి బైజూస్ సిద్ధమైంది. ఇండిపెండెంట్‌గానే బైజూస్ స్వంతం చేసుకున్నప్పటికీ గ్రేట్ లెర్నింగ్ యాప్‌ను ఇండిపెండెంట్‌గానే కొనసాగనుంది. బైజూస్ నేతృత్వంలో గ్రేట్ లెర్నింగ్ ఫౌండర్ మోహన్ లక్ష్మణరాజు, కో ఫౌండర్లు హరి నాయర్, అర్జున్ నాయర్లు గ్రేట్ లెర్నింగ్‌ను ఇకపై ముందుకు తీసుకెళ్లనున్నారు. పైగా బైజూస్ నుంచి భారీగా పెట్టుబడులు రానుండటంతో మరింత సమర్థంగా గ్రేట్ లెర్నింగ్‌ను తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేట్ లెర్నింగ్ ఆన్లైన్లో అందిస్తోంది. ఈ యాప్‌కు 15 లక్షల మంది వినియోగదారులు 170 దేశాల్లో ఉన్నారు. గ్రేట్లెర్నింగ్కి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, నేషనల్ యూనివర్సిటీ సింగపూర్, ఐఐటీ బొంబాయి వంటి ప్రముఖ సంస్థల సహాకారం అందిస్తున్నాయి. అవకాశాలు సృష్టిస్తాం గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేయడంపై బైజూస్ ఫౌండర్, సీఈవో బైజూ రవీంద్రన్ స్పందిస్తూ..‘ నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం, తిరిగి నేర్చుకోవడం అనేవి ముఖ్యమైన నైపుణ్యాలు. మాకు ఎందులో అయితే ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడ అవకాశాలు సృష్టిస్తాం, కొత్త దారులు వేస్తాం. మాకు ఎక్కడ అనుభవం లేదో కూడా తెలుసు. అక్కడ అనుభవం ఉన్న వారితో అవకాశాలు సృష్టిస్తాం’ అంటూ పేర్కొన్నారు. -
ఆన్లైన్ ఈ ‘లైన్’లో
సాక్షి, హైదరాబాద్ : ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ బోధన రెండు సెషన్లు చాలని, ప్రీప్రైమరీ తరగతులకు రోజుకు అరగంట బోధన సరిపోతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. కోవిడ్–19 ఆంక్షల నేపథ్యంలో పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి రోజులో నిర్వహించే సెషన్స్ సంఖ్య, వ్యవధి పరిమితంగా ఉండాలని కోరింది. పాఠశాలల యాజమాన్యాలు రెగ్యులర్ తరగతుల మాదిరిగానే ఆన్లైన్ బోధన చేపడుతున్నాయనీ, దీనివల్ల తమ పిల్లలు గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి వస్తోందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) మంగళవారం ‘ప్రజ్ఞత’ పేరుతో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రీప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతి వ్యవధి రోజులో 30 నిమిషాలకు మించరాదు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 45 నిమిషాల చొప్పున రెండు ఆన్లైన్ సెషన్స్ ఉంటే సరిపోతుంది. 9 నుంచి 12వ తరగతుల వారికైతే 30 నుంచి 45 నిమిషాల చొప్పున నాలుగు సెషన్లలో బోధన జరపవచ్చు. ‘కోవిడ్–19 మహమ్మారితో పాఠశాలల మూసివేత ప్రభావం దేశంలోని సుమారు 24 కోట్ల మంది చిన్నారుల విద్యపై పడింది. ఇది ఇలాగే కొనసాగితే వారి చదువులకు తీవ్రనష్టం కలుగుతుంది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు ఆన్లైన్ ద్వారా నాణ్యమైన విద్య అందించాల్సి ఉంది’అని హెచ్చార్డీ శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి సలహాలు తీసుకొని ఎన్సీఈఆర్డీ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేవలం సలహాపూర్వకమేనని, స్థానిక అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మార్చుకోవచ్చని హెచ్ఆర్డీ తెలిపింది. అనుసరించాల్సిన మార్గదర్శకాలివే..... – డిజిటల్ బోధనకు సంబంధించి ప్రిన్సిపాళ్లు ముందుగా విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతరత్రా సాంకేతిక పరికరాల సదుపాయాలపై అనధికారిక సర్వే చేయాలి. ఆయా వసతులను బట్టి విద్యార్థులను గ్రూపులుగా విభజించాలి. – డిజిటల్ విద్యను మూడు మాధ్యమాలుగా హెచ్ఆర్డీ విడగొట్టింది. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఉండి... ఇంటర్నెట్ ఉంటే ఆన్లైన్ మోడ్. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఉండి ఇంటర్నెట్ లేకపోతే పాక్షిక ఆన్లైన్ మోడ్. కేవలం టీవీ, రేడియో ఉండి ఇంటర్నెట్ లభ్యత లేకపోతే ఆఫ్‌లైన్ మోడ్‌గా పేర్కొంది. ఈ మూడు కేటగిరీలనూ దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని పేర్కొంది. – పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీచర్ల బోధనకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు/ ట్యాబ్లెట్స్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి కల్పించాలి. – ఎక్కువ సమయం ఆన్లైన్ బోధన వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక సమయం కూర్చొనే క్రమంలో వెన్నెముకపై, కళ్లపై ప్రభావం పడుతుంది. కాబట్టి దీన్ని నివారించాలి డిజిటల్ బోధన అమలు.. – పూర్వ ప్రాథమిక (ప్రీప్రైవురీ) తరగతులకు సంబంధించి తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ కావాలి. అదీ అరగంటకు మించి ఉండకూడదు. – 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ జారీ చేసిన ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్‌ను అమలు చేయాలి. – ప్రాథమిక తరగతులకు ఆన్లైన్బోధనకు సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్రాలే తీసుకోవాలి. – 9 నుంచి 12వ తరగతి వరకు రోజుకు నాలుగు సెషన్లకు మించి ఉండకూడదు. – రెండు సెషన్లకు మధ్య 10 నుంచి 15 నిమిషాల విరామం విద్యార్థులకు ఇవ్వాలి. దీంతో వారు ఫ్రెష్ అప్ అవుతారు. – ఆన్లైన్ తరగతులు బోధించే క్రమంలో విద్యార్థులు ఇంటరాక్ట్ అయ్యేలా చూడాలి. – విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ అభ్యసన సమపాళ్లలో ఉండాలి. విద్యార్థులు దీనిని పాటించేలా చూడాలి. – విషయం 5 బుల్లెట్ పాయింట్లకు మించకూడదు. – గ్రాఫ్‌లు, పటాలు, సాధ్యమైనంతవరకు పట్టికలను నివారించాలి. వలస కార్మికుల పిల్లల పేర్లు తొలగించకండి కోవిడ్–19 కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికుల పిల్లల పేర్లను పాఠశాలల ఎన్రోల్మెంట్ రోల్స్ నుంచి తొలగించకుండా చూడాలని కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చార్డీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతర ప్రాంతాలకు, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన పిల్లల వివరాలను సేకరించి ఉంచాలని, వీరిని వలస వెళ్లిన వారు, లేక తాత్కాలికంగా అందుబాటులో లేని వారిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. వీరు ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశాలున్నందున ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతి స్కూలు ప్రత్యేకంగా ఇటువంటి వారి వివరాలు తయారు చేసి, వారి తల్లిదండ్రులు/ సంరక్షకుల ఫోన్ నంబర్లను కూడా తీసుకోవాలని పేర్కొంది. వారు తమ సొంతూళ్లలో ఎంతకాలం ఉన్నారనే విషయం కూడా స్పష్టంగా తెలపాలంది. ఈ మేరకు తయారైన నివేదికను తరగతుల వారీగా విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పంపించాలని తెలిపింది. అదేవిధంగా, ఇతర ప్రాంతాలు, లేక రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు వచ్చిన చిన్నారులకు పాఠశాలలు విధిగా అడ్మిషన్లు కల్పించాలని కూడా ఆ మార్గదర్శకాల్లో కోరింది. ప్రవేశం కల్పించేందుకు తల్లిదండ్రుల/ సంరక్షకుల గుర్తింపు ధ్రువీకరణ తప్ప, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ వంటివేవీ అడగరాదని స్పష్టం చేసింది. చిన్నారుల సంబంధీకులు ఇచ్చిన సమాచారాన్ని వాస్తమైందిగా భావించి, సమీప ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ప్రవేశం కల్పించాలని తెలిపింది. -
ఆన్లైన్ క్లాసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబై : ఆన్లైన్ కాస్లులు అనేవి ఓ గొప్ప ప్రగతిశీల చర్యగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ క్లాసులు వ్యతిరేకించడం జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమేనని తెలిపింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని.. ప్రపంచం డిజిటల్ యుగం కొనసాగుతోందని పేర్కొంది. డిజిటల్, వర్చువల్ లెర్నింగ్‌ను అందరూ ప్రొత్సహించాలని కోరింది. దీనిని అడ్డుకోవం అంటే ప్రాథమిక విద్యాహక్కును కాలరాయడమేనని తెలిపింది.(చదవండి : బీమా సంస్థల విలీనం వాయిదా) ఆన్లైన్ క్లాసుల నిర్వహణలో ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేయాలని సూచించింది. ఈ-లెర్నింగ్ కోసం మరింత మెరుగైన ఎస్వోపీ అమలు చేయాలని తెలిపింది. ఆన్లైన్ క్లాసుల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
కోటిన్నర మందికి పాఠాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా, రోగ లక్షణాలు మొదలుకుని చికిత్స దాకా క్షేత్రస్థాయిలో అవగాహన అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, మూడో దశకు చేరుకుంటే తలెత్తే పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కరోనా విస్తరిస్తే కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ‘ఈ ప్లాట్పారమ్’ను రూపొందించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఎన్సీసీ, నెహ్రూ యువకేంద్రం, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్‌క్రాస్ సంస్థలకు చెందిన కార్యకర్తలకు ‘ఆన్లైన్ లెర్నింగ్’ విధానంలో పాఠాలు బోధించాలని డీఓపీటీ నిర్ణయించింది. వీరికి ముందస్తు అవగాహన, శిక్షణ ద్వారా అత్యయిక స్థితిని ఎదుర్కోవచ్చని డీఓపీటీ భావిస్తోంది. డీఓపీటీకి చెందిన ‘ఐ గాట్’ వెబ్సైట్లో అంతర్భాగంగా పనిచేసే ‘ఈ ప్లాట్ఫారం’ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి శిక్షణ ఇస్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎవరెవరు ఏయే విధులు నిర్వర్తించాలి అనే అంశంపై సలహాలు, సూచనలకు సంబంధించిన మాడ్యూల్స్ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో సుమారు లక్ష మందికి ఈ తరహా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
బడిపిల్లలకు ‘ఈ–మ్యాగజైన్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్తగా ఈ–మ్యాగజైన్ (ఎడ్యుషూర్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పత్రికలో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశ బోధన, అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు సూచనలు ఇందులో ప్రస్తావిస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ మ్యాగజైన్ ఉపయోగపడనుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ ఎడిషన్‌ను ప్రదర్శిస్తారు. వీటిలోని అంశాలను విద్యార్థులకు బోధిస్తారు. ఈ మ్యాగజైన్‌ను మంత్రి పి.సబితారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం లో దాదాపు 29 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. వీరందరూ ఈ– మ్యాగజైన్‌ను చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మల్టీలెవల్లో మోసం
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చంటూ ‘ఈ–లెర్నింగ్’కోర్సుల పేర వలవేస్తారు. వలకు చిక్కిన వారిని నెమ్మదిగా మల్టీ లెవల్ మార్కెటింగ్‌లోకి దింపుతారు. భారీగా కమిషన్లు వస్తాయంటూ ఆశచూపిస్తారు. ఎంత మందిని చేర్పించినా.. కమిషన్ మాత్రం చెల్లించరు. ఇలా లక్షల మంది నుంచి వందల కోట్లు వసూలు చేసింది ఈబిజ్.కామ్ ప్రైవేట్ లిమిటెడ్. వీరి చేతిలో మోసపోయిన విద్యార్థి సమల్ల వివేక్ ఫిర్యాదుతో ఈ స్కాం బయటికొచ్చింది. దీంతో నోయిడాకు చెందిన ‘ఈబిజ్.కామ్’ప్రతినిధి హితిక్ మల్హాన్‌ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందిని ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో చేర్చుకొని రూ.వెయ్యి కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితిక్‌ను నోయిడాలో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. ఈ కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.70.5 కోట్లను ఫ్రీజ్ చేశారు. మల్హన్ ఫ్యామిలీ కనుసన్నల్లో నడుస్తున్న ఈ భారీ మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. రిటైల్ ప్రొడక్ట్స్తోనూ మోసాలు... ఇదిలా ఉండగా ఈ–లెర్నింగ్ కోర్సు వలలో పడిన వారిలో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో ఫ్యాషన్‌పై వారికున్న అభిరుచిని డబ్బుగా మలచుకునేవారు. జీన్ పాయింట్లు, షర్ట్లు, టీషర్ట్లు, బెల్ట్‌లు అతి తక్కువ ధరకే ఇస్తామంటూ డబ్బులు కట్టించుకొనేవారు. నాసిరకం వస్తువులిస్తూ.. ఇందులో మరికొందరిని చేర్పిస్తే కమిషన్లు వస్తాయంటూ ఆశచూపేవారు. అలాగే ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామనేవారు. ఇలా అన్ని కలిపి లక్షల మందిని గొలుసు కట్టు పథకాల ద్వారా మోసగించినట్లు పోలీసు విచారణలో తేలింది. చాలా మంది విద్యార్థులు ఈ కంపెనీలో డబ్బులు పెట్టారని విచారణలో తేలింది. వరంగల్, ఆదిలాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కంపెనీ మోసాలపై కేసులు ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. పరారీలో ఉన్న కంపెనీ ఎండీ, డైరెక్టర్లు పవన్ మల్హన్, అనిత మల్హన్ కోసం గాలిస్తున్నామన్నారు. డబ్బులొస్తాయని ఆశచూపారు... మా అన్నయ్య స్నేహితుడు 2 నెలలు గడవగానే రెట్టింపు డబ్బులు వస్తాయంటూ చెప్పడంతో రూ.16,821 చెల్లించి ఈబిజ్ కంపెనీ ఈ–లెర్నింగ్ కోర్సులో చేరా. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నాకు హాస్టల్ ఖర్చుల కోసం ఆ కంపెనీ ఇచ్చే డబ్బు ఉపయోగపడుతుందని ఆశించా. అయితే 2 నెలలు గడిచినా డబ్బులు రాలేదు. అంతేకాదు మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్ వస్తుందని చెప్పారు. దీంతో 8 మందిని చేర్పించా. ఎలాంటి కమిషన్ ఇవ్వలేదు. ఆ కంపెనీ ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెరిచి చూస్తే నా బ్యాంక్ ఖాతాలో కమిషన్ వేసినట్లు కనిపిస్తున్నా... అకౌంట్లో మాత్రం డబ్బు పడలేదు. దీంతో ఆ కంపెనీ రిప్రజెంటీవ్లను వెళ్లి నిలదీస్తే డబ్బులు రావు నీ దిక్కున్నచోట చెప్పుకో అన్నారు. దీంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించా. – వివేక్, జగిత్యాల జిల్లా కమిషన్ వస్తుందని ఎరవేస్తారు.. పవన్ మల్హన్ ఎండీగా, అతని భార్య అనితా మల్హన్ డైరెక్టర్‌గా 2001లో నోయిడాలో ఈబిజ్.కామ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. 2007 నుంచి కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఈ–లెర్నింగ్ కోర్సుల పేరుతో కంపెనీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళుతున్నారు. పవన్ కుమారుడు హితిక్ కంపెనీ కార్యకలాపాలను చూస్తూ దాదాపు 7 లక్షల మందిని సభ్యులుగా చేర్పించాడు. ఈ–లెర్నింగ్ ప్రాజెక్టుల ద్వారా సులభ పద్ధతిలో డబ్బు సంపాదించే వ్యాపార మార్గాలున్నాయంటూ యువతను ఆకర్శిస్తారు. రూ.16,821 డబ్బులు వసూలు చేసి.. ఈబిజ్ బిజినెస్ ప్యాకేజీలు నచ్చకపోతే నెల రోజుల్లోపు నగదు తిరిగి ఇస్తామంటూ హామీలిస్తారు. ఈ నెల రోజుల సమయం తెలియకుండా విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ల మనసు మారకుండా చూసుకుంటారు. ఈ సమయంలోనే మీరు మరో ఇద్దరిని ఈ కోర్సుల్లో చేర్పిస్తే 30 వేల పాయింట్లు, రూ.2,700 (తొమ్మిది శాతం) కమిషన్ వస్తుందని ఆశచూపుతారు. ఎక్కువ సంఖ్యలో చేర్పించిన వారికి సిల్వర్, గోల్డ్, డైమండ్, డిప్లోమేట్, సిల్వర్ డిప్లోమేట్, గోల్డ్ డిప్లోమేట్ లాంటి టైటిళ్లను ఇస్తారు. ఇలా ఈ–లెర్నింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి ఏ యూనివర్సిటీకి అనుబంధంగా లేని సర్టిఫికెట్లను ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మొత్తంగా ఎక్కువ మంది విద్యార్థులు ఈ–లెర్నింగ్ కోర్సుల కన్నా సభ్యులను చేర్పిస్తే కమిషన్ వస్తుందనే ఆశతో పనిచేసేలా నిర్వాహకులు చూస్తారు. కంపెనీకి డీడీ ద్వారా డబ్బులు కట్టి చేరిన సభ్యుడికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా కేటాయిస్తున్నారని సీపీ తెలిపారు. -
ఈ–లెర్నింగ్‌లో తెలంగాణ నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్ : ‘ఈ లెర్నింగ్ శిక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుంద’ని ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ లెర్నింగ్ శిక్షణలో తెలంగాణ రాష్ట్రం మిగతా 28 రాష్ట్రాల కంటే ముందుండే విధంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 16,510 మందికి శిక్షణ ఇచ్చాం. మరో 60 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు సమయ పాలన , నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌పై శిక్షణ ఇస్తూ, బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు అయ్యేలా తయారు చేస్తున్నాం’అని చెప్పారు. -
‘ఆకోలి’కి స్కోచ్ అవార్డ్
జైనథ్ : దేశంలోని సామాన్య ప్రజల సామాజిక–ఆర్థిక ప్రగతికి విశేషంగా కృషి చేసిన వారికి అందించే అత్యుత్తమ స్కోచ్ అవార్డుకు జైనథ్ మండలం ఆకోలి గ్రామం ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ ఈ సాక్షరత మిషన్‌లో భాగంగా ఆకోలి గ్రామాన్ని వంద శాతం ఈ సాక్షరత గ్రామంగా మార్చిన భోరజ్ మీసేవా కేంద్రం, సీఎస్సీ నిర్వాహకుడు నివల్కర్ గజానన్ అవార్డును అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నిర్వహించిన 45వ జాతీయ స్కోచ్ సదస్సులో సీఎస్సీ జాతీయ ఉపాధ్యక్షుడు రాజ్‌కిశోర్ అవార్డు అందజేశారు. గజానన్ సదస్సులో ప్రత్యేకంగా ఈ సాక్షరత స్టాల్స్‌ను ఏర్పాటు చేసే అరుదైన అవకాశం సైతం దక్కించుకున్నారు. ఈ స్టాల్లో వంద శాతం ఈ సాక్షరత గ్రామంగా ఆకోలిని మలచడానికి ఆయన చేసిన కృషి, దాని ఫలితాలను తెలిపే వీడియోలు, ఫొటోలు ప్రదర్శించారు.