దీని బండబడ.. ప్రాణం పోవడం ఖాయం | Old Rocks Found In Bheemadevearapally In Warangal | Sakshi
Sakshi News home page

దీని బండబడ.. ప్రాణం పోవడం ఖాయం

Published Sun, Mar 28 2021 7:59 AM | Last Updated on Sun, Mar 28 2021 11:13 AM

Old Rocks Found In Bheemadevearapally In Warangal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు వంద మీటర్ల ఎత్తుతో పూర్తి ఏటవాలుగా ఉన్న గుట్ట.. దాన్ని ఆనుకొని పెద్ద లోయ.. ఆ ఏటువాలు శిఖర ప్రాంతంలో ఒకదానిపై ఒకటి పేర్చినట్టు మూడు భారీ గుండ్లు. అవి ఏ క్షణాన జారి అగాధంలో పడతాయోనన్న భావన కలుగుతుంది. అలాంటి గుండ్లలో పైదానిపై నిలబడితే ఏమనిపిస్తుంది? పై ప్రాణం పైనే పోవడం ఖాయమన్న భావన కలుగుతుంది. అలాంటి భయం కలిగేందుకే ఆ సెటప్‌ అట. అలా భయపెట్టి పన్నులు వసూలు చేసుకొనే వారన్నది ఇప్పుడు స్థానికుల మాట. అందుకే ఆ పేర్చిన బండరాళ్లను శిస్తు రాళ్లుగా స్థానికులు పిలుచుకుంటున్నారు. ఇది కాకతీయుల కాలానికి చెందినదై ఉంటుందంటున్నారు. కానీ దానికి స్థానికంగా శాసనపూరిత ఆధారాలు లేవు. నోటి మాటల ద్వారా పూర్వకాలం నుంచి వచ్చిన ప్రచారమది. 

నాయకార్ల పనేనా..? 
కాకతీయ సామ్రాజ్యంలో పాలన స్వర్ణయుగంగానే చెప్తారు. ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు చక్రవర్తులు ఎన్నో చర్యలు తీసుకున్నారనడానికి ఆధారాలు ఉన్నాయి. వ్యవసాయం కోసం గొలుసుకట్టు చెరువులు తవి్వంచి ఇప్పుడు తెలంగాణలో ఏ మూలకెళ్లినా వందల చెరువులు దర్శనమివ్వడం వారి చలవే. వారి పాలనలో ప్రజలను పన్నుల కోసం పీడించిన దాఖలాలు లేవు. అయితే పాలనా సౌలభ్యం కోసం వారి హయాంలో నాయకార్‌ వ్యవస్థ ఏర్పాటైంది. స్థానికంగా కొంత ప్రాంతంపై వారి అజమాయిషీ ఉండేది. పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి అందించడం కూడా వారి విధి. ఇలాంటి బాధ్యతలున్న ఒకరిద్దరు చేసిన దాషీ్టకాల్లో ఈ గుండు కూడా ఒకటి అయి ఉంటుందన్నది చరిత్రకారుల మాట.

ప్రస్తుత వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామ శివారులోని గుట్టపై ఈ ‘శిస్తు గుండ్లు’న్నాయి. ఈ గుట్టపై ఇతర చారిత్రక ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. కాకతీయులు నిర్మించిన కోట గోడ తరహా నిర్మాణంతోపాటు హరప్పా, కాలీబంగలలో వెలుగు చూసిన టెర్రకోటా ఫలకాల తరహావి ఇక్కాడా కనిపించాయి. మట్టితో చిన్న బిళ్లలుగా చేసి కాల్చి అనంతరం వాటిని టైల్స్‌గా ఇళ్లలో ఏర్పాటు చేసుకొనేవారు. డంగు సున్నం పూత పూసి దానిపై ఈ బిళ్లలు అతికించేవారు. ఈ చారిత్రక ఆధారాల మధ్య ప్రత్యేకాకర్షణగా ఈ నిలువు గుండ్లున్నాయి. స్థానిక నాయకార్‌ ఈ ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతుకులకు గురిచేసి మరీ పన్నులు వసూలు చేసేందుకే ఈ ఏర్పాటు చేసి ఉంటారన్నది ఓ వాదన. 

పూర్వం నుంచి ప్రచారం... 
గుట్ట వాలును కొంత మేర తొలిచి మరింత వాలు చేశారు. దానిపైన పెద్ద బండరాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చారు. పన్ను కట్టని వారిని వాటిపై నిలబెట్టే వారని, కింద లోయలోకి జారి పడిపోతామన్న భయంతో వారు పన్ను చెల్లించేవారని, అలా ఒకరిని భయపెడితే మిగతా వారు పన్ను ఎగ్గొట్టే సాహసం చేసే వారు కాదని స్థానికులు పేర్కొన్నారు. అలా పూర్వకాలం నుంచి మౌఖికంగా ఈ ప్రచారం సాగుతోంది. దానికి ప్రత్యేకాధారాలంటూ అక్కడ లేవు. కాకతీయుల కాలంలోనే దాన్ని ఏర్పాటు చేశారన్నదానికీ ఆధారాలు లేవు. కానీ అది శిస్తుబండ అని గ్రామస్తులు చెబుతున్నారు. 
– ఔత్సాహిక పరిశోధకుడు, రత్నాకరరెడ్డి

 
ఇది జనగామ జిల్లా బానాజిపేట గ్రామంలో గడి ముందు ఉన్న నిలువురాయి. నిజాంల దాషీ్టకానికి నిలువెత్తు నిదర్శనం. దాన్ని లాల్‌ కనీ(కడీ)గా పిలుస్తారు. శిస్తు చెల్లించని వారిని, రజాకార్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దీనికి కట్టేసి కొట్టేవారు. బొడ్రాయి తరహాలో ఇది ఊరు మధ్యలో ఉంది. ఇప్పటికీ ఈ రాయిని అలాగే ఉంచడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement