మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్‌కు వినతిపత్రం అందజేస్తున్న వృద్ధురాలు. చిత్రంలో మంత్రి సత్యవతి రాథోడ్
మరిపెడ రూరల్: తన కష్టార్జితంతో నలుగురు కుమారులకు 60 ఎకరాలు సంపాదించి పెట్టినా.. తనకు వృద్ధాప్యంలో కనీసం బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లాతండాకు చెందిన భూక్య నాజీ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్ కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె.. కలెక్టర్ వీపీ గౌతమ్, మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫిర్యాదు చేసింది. భూక్యతండాకు చెందిన నాజీ, సోమ్లా దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. భార్యాభర్తలు వంశపారంపర్యంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసి కష్టపడి 60 ఎకరాలకు పెంచారు.
నలుగురు కుమారులకు 13 ఎకరాల చొప్పున పంచి ఇచ్చారు. కుమార్తె వివాహం ఘనంగా జరిపించారు. కొడుకులకు పంచగా మిగిలిన 6 ఎకరాల భూమి నాజీ పేర ఉన్నది. నాజీ భర్త సోమ్లానాయక్ 2009లో మృతి చెందడంతో చిన్నకుమారుడు లక్ష్మాజీ వద్ద కొన్నేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో లక్ష్మాజీ కుమారుడు భూక్య చందులాల్ సాదాబైనామాలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, తన తల్లి పేరున పట్టా చేయించుకున్నాడని, అప్పటి నుంచి కొడుకు కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని నాజీ వాపోయింది. తనను బయటకు గెంటేశారని, మిగతా కొడుకులు కూడా అన్నం పెట్టడం లేదని వాపోయింది. తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని మంత్రిని, కలెక్టర్‌ను వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment