సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిలో భాగంగా జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒమిక్రాన్ నియంత్రణకు ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ/పోలీసు కమిషనర్లను ఆదేశించారు.
ప్రభుత్వ ఆంక్షలు ఇవీ...
► కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తూ ఇతర జన సామూహిక కార్యక్రమాలు జరుపుకోవాలి.
► ఈ కార్యక్రమాల్లో భౌతికదూరం నిబంధన పాటించడం తప్పనిసరి.
► మాస్క్ లేకుండా ఏ వ్యక్తినీ సామూహిక కార్యక్రమాలకు అనుమతించరాదు.
► ప్రవేశద్వారం వద్ద ఐఆర్ థర్మామీటర్లు/థర్మల్ స్కానర్లతో లోపలికి వచ్చే వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించాలి.
► బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వ్యక్తులపై జరిమానాలను విధించాలన్న గత ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలి.
మరో ముగ్గురికి ఒమిక్రాన్
రాష్ట్రంలో కొత్తగా మూడు కోవిడ్–19 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారే. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 30కి చేరింది. వీరిలో పది మంది రికవరీ అయ్యారు. శనివారం విదేశాల నుంచి 333 మంది వచ్చారు. వీరిలో 8 మందికి కోవిడ్–19 పాజిటివ్‌గా తేలగా, ఈ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్‌కు తరలించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
జీనోమ్ సీక్వెన్స్‌కు సంబంధించి మొత్తం 20 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇదిలావుండగా, రాష్ట్రంలో కొత్తగా 140 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఇప్పటివరకు 6,80,553 మంది కరోనా బారిన పడగా, 6,73,033 మంది కోలుకున్నారు. మరో 3,499 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 26,947 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 4,267 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment