ఏడు రోజుల్లో 31 శాతం ధరణి దరఖాస్తులకే లైన్ క్లియర్
టీఎం15, 33ల కింద పెండింగ్‌లో ఉన్న 1.45 లక్షల దరఖాస్తులు
స్పెషల్ డ్రైవ్‌లో పరిష్కారమైంది 25 వేల లోపు మాత్రమే
సిబ్బంది లేమి, రికార్డుల పరిశీలనలో జాప్యంతో ఆలస్యమవుతున్న ప్రక్రియ
85% క్లియరెన్స్‌తో ముందంజలో జగిత్యాల, 6% క్లియరెన్స్‌తో అట్టడుగున పాలమూరు
ఇంకా స్పెషల్ డ్రైవ్ కొనసాగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్ ఈనెల 9వ తేదీ(శనివారం) తర్వాత కూడా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్‌లో కేవలం 31 శాతం దరఖాస్తులు మాత్రమే క్లియర్ అయిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కార్యాచరణ కొనసాగుతుందని రెవెన్యూ, ధరణి పునర్మి ర్మాణ కమిటీ వర్గాలు చెపుతున్నాయి.
పెండింగ్‌లో ఉన్న 2,46,536 దరఖాస్తులకు గాను ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 76,382 దరఖాస్తులను క్లియర్ చేయగా, మరో 1,70,154 దరఖాస్తులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, 9 రోజుల తర్వాత పెండింగ్‌లో ఒక్క దరఖాస్తు కూడా ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండడం, రికార్డుల పరిశీలనలో జాప్యం జరుగుతుండడంతో పాటు 8, 9 తేదీల్లో సెలవులు రావడంతో ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఈనెల 9 తర్వాత కూడా ఈ డ్రైవ్‌ను కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
6 శాతం.... 85 శాతం
జిల్లాల వారీగా పరిశీలిస్తే పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంలో జగిత్యాల ముందంజలో ఉంది. ఇక్కడ 85 శాతం దరఖాస్తులపై రెవెన్యూ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 69 శాతం దరఖాస్తులు క్లియర్ అయ్యాయి. నారాయణపేట (65), పెద్దపల్లి (65), భద్రాద్రి కొత్తగూడెం (62), వరంగల్ (56), జనగామ (56), రాజన్న సిరిసిల్ల (52), సిద్ధిపేట, హనుమకొండ (51) జిల్లాల్లో 50 శాతానికి పైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి.
ఇక, అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 6 శాతమే పరిష్కారం కాగా, కరీంనగర్‌లోనూ 6 శాతం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 7, రంగారెడ్డిలో 9 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. మాడ్యూళ్ల వారీగా చూస్తే కీలకమైన రెండు మాడ్యూళ్లలో దరఖాస్తుల క్లియరెన్స్ నత్తనడకనే సాగుతున్నట్టు అర్థమవుతోంది. టీఎం15 కింద ల్యాండ్ మ్యాటర్స్ సమస్యల పరిష్కారానికి గాను 40,605 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 43 శాతం అంటే 17,372 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 23,233 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరో కీలకమైన టీఎం 33 మాడ్యూల్‌లో 1,01,132 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 27,047 దరఖాస్తులు పరిష్కారం చేయగా, 74,085 పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం.
ఇది నిరంతర ప్రక్రియ: ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి
‘ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఆగదు. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నాం. ఈనెల 9వ తేదీ తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ వచ్చినా దీనిపై ఎలాంటి ప్రభావం ఉండదు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ కొందరు ధరణి దరఖాస్తుల పరిశీలనలో పాలు పంచుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment