మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు
నిర్మల్/బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో ఏం జరుగుతోంది? పదిరోజులుగా ఎందుకు పతాక శీర్షికలకు ఎక్కుతోంది!? దీనిపై ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈనెల మొదటివారంలో విద్యార్థులు తినే టిఫిన్‌లో కప్ప రాగా.. ఆపై వరుసగా అన్నంలో తోకపురుగులు, కూరల్లో లైట్‌పురుగులు వస్తూనే ఉన్నాయి. 8వేల మంది విద్యార్థులు తినే భోజనాల్లో ఇలా కప్పలు, పురుగులు వస్తున్నా.. అటు మెస్ నిర్వహించే వారు.. ఇటు వర్సిటీ వర్గాలు స్పందించింది లేదు.
తల్లిదండ్రుల్లో ఆందోళన..
‘మా పిల్లలు బాసర ట్రిపుల్‌ఐటీలో చదువుతున్నార’ని ఇప్పటివరకు గర్వంగా చెప్పుకున్న తల్లిదండ్రులు ప్రస్తుత పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి చదువులపై బెంగలేదు కానీ విద్యార్థులకు పెడుతున్న తిండి గురించే కలవరపడుతున్నామని వారంటున్నారు. గతంలో బాసర వర్సిటీలోకి మీడియాను అనుమతించేవారు. కొన్నేళ్లుగా మీడియాను అనుమతించట్లేదు. దీంతో అక్కడేం జరుగుతుందో తెలియట్లేదు.
వీసీ కోసం ఎదురుచూపు.
బాసర ట్రిపుల్‌ఐటీలో పాలన గాడితప్పడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం. ఏళ్లుగా ఇన్‌చార్జి వీసీలతోనే సర్కారు వర్సిటీని నెట్టుకొస్తోంది. రెండేళ్లుగా ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతున్న రాహుల్‌బొజ్జ.. న్యాక్‌బృందం వర్సిటీ పరిశీలనకు వచ్చినప్పుడే ఇక్కడికొచ్చారు. తర్వాత మళ్లీ ఇటువైపు చూడలేదు. ఇటీవల ఘటనలపై స్పందించలేదు. సీఎంఓ కార్యాలయ బాధ్యతల్లోనూ ఉన్న ఆయన హైదరాబాద్ నుంచే వర్సిటీని పర్యవేక్షిస్తున్నట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో వర్సిటీలో స్థానిక అధికారులదే ఇష్టారాజ్యమైంది.
మంత్రిని కలిసిన తల్లిదండ్రులు
బాసర ట్రిపుల్‌ఐటీలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఇక్కడి పరిస్థితుల్ని వివరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి.. జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక తెప్పించుకున్నామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment