ఐమాక్స్‌లో గురువారం రాత్రి ఎస్కలేటర్‌పై తోపులాట
సాక్షి, ఖైరతాబాద్: ఏ కొత్త సినిమా విడుదలైనా ప్రజలు ఐమాక్స్‌కు క్యూ కడతారు. అయితే నిర్వాహకులు సినిమాకు వచ్చే వారి వద్ద టికెట్ డబ్బులు వసూలు చేయడం తప్ప సందర్శకుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. సినిమాకు వచ్చేవారు సరైన పార్కింగ్ సదుపాయం లేక నరక యాతన పడుతున్నా యాజమాన్యం నో పార్కింగ్, పార్కింగ్ ఫుల్ అంటూ బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటోంది. పార్కింగ్ నిండిపోయిందని షో పూర్తయ్యే వరకు వేచి ఉండాలంటూ సెక్యురిటీ సిబ్బంది చెబుతుండటంతో సందర్శకులు దిక్కు తోచని స్థితిలో రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేసి హడావిడిగా షో టైం అవుతోందని పరుగులు తీస్తున్నారు.
దీంతో ఐమాక్స్ నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ట్రాఫిక్ జాం అవుతోంది. గతంలో ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ స్థలంలో కార్లను పార్కింగ్ చేసుకునేవారు. ప్రస్తుతం ఆ స్థలంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో సదరు స్థలంలో పార్కింగ్ చేసుకునేందుకు వీలులేకుండా పోయింది. ఐమాక్స్ ఎదురుగా ఉన్న జీహెచ్‌ఎంసీ స్థలంలో స్థలంలోనూ ఖైరతాబాద్ ప్రాంత వాసులకోసం మల్టీ లెవల్ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ స్థలంలో ప్రస్తుతం పార్కింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు బైక్‌కు రూ. 30, కార్లకు రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఐమాక్స్‌లో అతిపెద్ద సినిమా థియేటర్‌తో పాటు మొత్తం 6 థియేటర్లు ఉంటాయి.
ఇవన్నీ నిండితే ఒకేసారి 500 పైగా కార్లు, బైక్‌లు వస్తాయి. ఐమాక్స్ సెల్లార్‌లో కేవలం 100 నుంచి 150 కార్లు, బైక్‌లకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది. దీంతో మిగతా వాహనాలను రోడ్డుపై పార్క్ చేసుకోవాల్సిందే. యాజమాన్యం సందర్శకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదనేందుకు గురువారం రాత్రి జరిగిన సంఘటనే నిదర్శనం. రాత్రి 11.15 నిమిషాలకు చివరి షోకు సందర్శకులు ఎస్కలేటర్ మీదుగా వెళ్తుండగా, అటు వైపు నుంచి షో ముగించుకొని వచ్చిన వారు ఎదురుగా రావడంతో ఎస్కలేటర్‌పై ఉన్న వారు ముందుకు వెళ్లేందుకు స్థలం లేక కేకలు వేశారు. వెంటనే ఎస్కలేటర్‌ను ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment