సాక్షి హైదరాబాద్: నగరంలోని ఐమాక్స్ దగ్గరలో అత్యాధునిక మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మించనున్నారు. ప్రజల సదుపాయార్థం హెచ్‌ఎండీఏకు చెందిన కోట్లాది రూపాయల విలువైన స్థలంలో దీనిని నిర్మించనున్నారు. సంపన్నులు తమ శుభకార్యాలకు వినియోగించే ఫంక్షన్ హాళ్ల మాదిరిగా వివిధ వర్గాల వారికి సైతం తగిన సదుపాయాలతో కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.
మంత్రి కేటీఆర్ చొరవతో..
ఐమాక్స్ సమీపంలోని ఇందిరానగర్‌లో డబుల్‌బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి ఇటీవల హాజరైన మంత్రి కేటీఆర్‌ను స్థానిక ప్రజా ప్రతినిధులు సదరు స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తే మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మించవచ్చని సూచించారు. పేదలు, దిగువ మధ్యతరగతి సైతం సదుపాయంగా ఉంటుందని తెలిపారు. సమ్మతించిన మంత్రి.. ఇందుకోసం కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఫంక్షన్ హాల్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 7 వేల చదరపు గజాల ఖాళీస్థలంలో కన్వెన్షన్‌హాల్‌ను నిర్మించనున్నారు.
అన్ని వర్గాలకూ అందుబాటులో..
పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి సదుపాయంగా ఉండేలా నిర్మించే యోచనలో అధికారులున్నారు. అందుకుగాను తగిన డిజైన్లు తదితరమైన వాటి కోసం ‘ఆర్ట్ ఆఫ్ ది స్టేట్‌గా’ ఉండేలా కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్లు పిలిచారు. స్ట్రక్చరల్, సివిల్, ఎలక్ట్రికల్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ డ్రాయింగ్స్‌తో పాటు ఫైర్‌సేఫ్టీ, ల్యాండ్ స్కేపింగ్ తదితర ఏర్పాట్లన్నీ సవివరంగా, సమగ్రంగా డీపీఆర్ సమర్పించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానించారు. ఎన్ని అంతస్తులు, ఎంత వ్యయం కానుంది వంటి వివరాలను సైతం కన్సల్టెన్సీలు అందజేయాలి. డిజైన్ ఖరారయ్యాక పనులు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పూర్తయి. ప్రజలకు వినియోగంలోకి వచ్చేంతవరకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ సంస్థ పనిచేయాల్సి ఉంటుంది.
ప్రముఖ ప్రదేశాలకు చేరువలో..
ఐమాక్స్‌కు ఎదురుగా నిర్మించబోయే మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్‌కు సమీపంలోనే కొత్త సచివాలయం రానుంది. దాని నిర్మాణ పనులు పగలూ, రాత్రి వేగంగా జరుగుతున్నాయి. కన్వెన్షన్ హాల్‌కు దగ్గరలోనే రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహం కూడా ఏర్పాటు కానుంది. హుస్సేన్‌సాగర్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు సైతం సమీపంలోనే ఉన్నాయి.
(చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’)
Comments
Please login to add a commentAdd a comment