ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లోని ప్రశాంతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన కిషన్ (38) మానసిక సమస్యతో ప్రశాంతి హాస్పిటల్‌లో చికిత్సకోసం పది రోజుల క్రితం చేరాడు. చికిత్స పొందుతున్న కిషన్ మంగళవారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. అయితే పేషెంట్ పరిస్థితిని అంచనా వేయకుండా వైద్యులు అడ్డగోలుగా కరెంట్ షాక్‌లు, ఓవర్‌డోస్ మందులు ఇవ్వడం మూలంగానే చనిపోయాడని ఆరోపిస్తూ బుధవారం ఉదయం మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.
టూటౌన్ పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం మృతుడి బంధువులతో చర్చించి సయోధ్య కుదుర్చుకున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై సైకియాట్రిస్టు డాక్టర్ పి.కిషన్‌ను వివరణ కోరగా, సదరు పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ పూర్తిచేసి డిశ్చార్జ్ చేసే సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందాడని తెలిపారు. వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. కాగా ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment