సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీకి కారణం సీఎం కేసీఆర్ అని మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదిగా మారి, కాసుల కోసం తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఓట్లకోసం నీటిని ఏటీఎంలా మార్చుకున్నారని, కాంగ్రెస్ శ్రేణులను తప్పుదోవ పట్టించేందుకే జల వివాదాల డ్రామా నడుపుతున్నారని దుయ్యబట్టారు. నీటి తరలింపుపై కేసీఆర్‌కు అన్ని విషయాలు చెప్పాకే ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. నీటి తరలింపుపై అన్ని విషయాలు తెలిసిన కేసీఆర్, కృష్ణా జలాల విషయంలో కృత్రిమ పంచాయతీ పెడుతున్నరని మండిపడ్డారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు సురేశ్ షెట్కార్ ఇంట్లో పీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్‌లతో జరిగిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ జల వివాదాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
వైఎస్, ఎన్టీఆర్‌లది ఓ శకం..
రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలది ఒక శకం అని, వారిద్దరూ సంక్షేమం ద్వారా ప్రజలకు చేయాల్సినంత సేవ చేశారని రేవంత్ కొనియాడారు. వైఎస్సార్, ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతులని, వారిని విమర్శించే వాళ్లు నికృష్టులని అన్నారు. ఈ రోజు జరుగుతున్న నీళ్ల దోపిడీలో రాజశేఖర రెడ్డి పాత్ర లేదన్నారు. కాంగ్రెస్ అభిమానులను తప్పు దారి పట్టించేందుకు కేసీఆర్ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులను షర్మిల వైపు నడిపించేందుకు కేసీఆర్ ఇదంతా చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు రాజశేఖరరెడ్డిని తిట్టడం ద్వారా రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారన్నారు.
Revanth Reddy : జల దోపిడీకి కారణం కేసీఆరే
Published Fri, Jul 2 2021 2:09 AM | Last Updated on Fri, Jul 2 2021 5:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment