సాక్షి, మంథని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్య జరిగి నేటికి సరిగ్గా మూడు నెలలు గడిచింది. తాము చేపడుతున్న కార్యక్రమాలకు ఇబ్బంది సృష్టిస్తున్నారనే కోణంలో న్యాయవాద దంపతులను ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలోని మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై కొందరు పట్టపగలే కత్తులతో నరికి చంపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోగలిగారు. గ్రామ కక్షలతోనే తాము హత్యలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. అయితే ఈ హత్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి.
న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు విన్నవించింది. హత్య జరిగిన సమయంలో కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులను కనిపెట్టడం పోలీసులకు సులువుగా మారింది. తనపై కత్తులతో దాడి చేసింది కుంట శ్రీను అని హత్యకు గురైన వామన్‌రావు వెల్లడించిన విషయం కూడా వీడియోలో రికార్డు అయింది. హత్య చేసిన అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపించారు. అయితే ఈ జంట హత్యలకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను సహకరించాడని పోలీసుల విచారణలో తేలింది. అప్పటినుంచే ఈ హత్యల్లో పుట్ట మధు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జంట హత్యల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు అనేక కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కేసు పలుమలుపులు తిరుగుతూ వస్తోంది. ఒక దశలో జెడ్పీ చైర్మన్ మధు మెడకు చుట్టుకుంటుందా..? అనే ప్రచారం కూడా జరిగింది. చార్జీషీటు నమోదు గడువు సమీపిస్తున్న సమయంలో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదు అప్పట్లో సంచలనం రేపింది. అకస్మాత్తుగా జెడ్పీ చైర్మన్ అదృశ్యం కావడంతో కేసు మరింత జఠిలంగా మారింది. వారంరోజులపాటు మధు తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. పోలీసులు మధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మధుతోపాటు ఆయన భార్య పుట్ట శైలజ, మరికొందరిని కూడా విచారించారు.
విచారణపై హైకోర్టు పర్యవేక్షణ
న్యాయవాద దంపతుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ కేసుపై హైకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. జంట హత్యల కేసును తామే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని, విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసు విచారణ కోసం కరీంనగర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఇటీవలే హైకోర్టుకు లేఖ రాసింది.
చార్జీషీట్ సిద్ధం
న్యాయవాద దంపతుల హత్య జరిగిన నేటికి 90 రోజులు కావస్తుండడంతో పోలీసులు కేసుకు సంబంధించిన చార్జీషీట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని కోణాల్లో విచారణ జరిపి పకడ్బందీగా చార్జిషీట్‌ను తయారు చేసినట్లు తెలిసింది. అందులో ఇంకా ఎవరైనా నిందితుల పేర్లను చేర్చుతారా..? లేదా ఇప్పటివరకు ఉన్నవారినే చూపిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం హత్యల్లో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో కోర్టులో చార్జీషీట్ సమర్పించే అవకాశం ఉంది.
చదవండి: లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..?
Comments
Please login to add a commentAdd a comment