సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో కల్లు సేవించి ఓ వ్యక్తి మృతి చెందడం. ఒకేసారి 183 మంది అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. బాధితులు ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోవడం.. వాంతులు, మూర్చతో గిలగిలా కొట్టుకోవడం చూసి జనం బెంబేలెత్తిపోయారు. వెంటనే వారిని వికారాబాద్, హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అలాగే.. 11 కల్లు దుకాణాలు, ఒక డిపోను అధికారులు సీజ్ చేశారు. వివరాలు.. నవాబ్‌పేట మండలం చిట్టిగిద్ద కల్లుడిపో నుంచి నవాబ్‌పేట, వికారాబాద్ మండలాల్లోని 11 గ్రామాలకు ప్రతిరోజు కల్లు సరఫరా అవుతోంది. శుక్రవారం సాయంత్రం కల్లు సేవించినవారు చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ఇలా ఈ డిపో పరిధిలో మొత్తం 183 మంది అస్వస్థతకు గురయ్యారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి మృతి చెందాడు. నవాబ్‌పేట మండలంలో 119 మంది, వికారాబాద్ మండలంలో 64 మంది అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు. కాగా, ఆయా ఆస్పత్రుల్లో 57 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖాధికారులు తెలిపారు. పెండ్లిమడుగుకు చెందిన కిష్టారెడ్డి కల్తీ కల్లు కారణంగానే మృతి చెందాడా? లేదా అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పేర్కొన్నారు.
మత్తు మందే కారణమా..?
కల్లు సేవించిన 183 మంది అస్వస్థతకు మత్తు మందు కారణమని తెలుస్తోంది. మత్తు మోతాదు తక్కువ అయితే కల్లుతాగిన వారిలో విత్‌డ్రావల్ లక్షణాలు కనిపిస్తాయని, ప్రస్తుతం వీరంతా ఈ లక్షణాల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. కాగా, కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
డిపో, 11 కల్లు దుకాణాలు సీజ్
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషీ తెలిపారు. చిట్టిగిద్ద కల్లుడిపో, 11 గ్రామాల్లోని కల్లు దుకాణాలను సీజ్ చేశామన్నారు. కల్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కల్తీకల్లుగా నిర్ధారణ అయితే డిపో నిర్వాహకులపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, రైతు కిష్టారెడ్డి కల్లు తాగి మృతి చెందడంపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సంజీవరావు తెలిపారు.
బాధితులకు మెరుగైన వైద్యం: సబిత
వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం మంత్రి సబితారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
కల్తీ కల్లు కలకలం.. 183 మందికి అస్వస్థత
Published Sun, Jan 10 2021 8:26 AM | Last Updated on Sun, Jan 10 2021 10:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment