మహబూబాబాద్‌లో మహాధర్నా తలపెట్టిన బీఆర్‌ఎస్
‘లగచర్ల’గిరిజనులకు సంఘీభావంగా నిర్వహించాలని నిర్ణయం
అనుమతి ఇవ్వని జిల్లా ఎస్పీ.. బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ నేతలు
మహబూబాబాద్ రూరల్: ‘లగచర్ల’గిరిజనులకు సంఘీభావంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో బీఆర్‌ఎస్ నేతలు ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘మహాధర్నాకు అనుమతి కోసం రెండు రోజులుగా ప్రయతి్నస్తున్నాం. తొలుత అనుమతి ఇస్తామని పోలీసులు చూచాయగా చెప్పారు. తీరా ఎస్పీ అనుమతి ఇవ్వలేమంటూ నిరాకరించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పిరికి పంద చర్య’’అని నేతలు మండిపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి దాకా ఎస్పీ కార్యాలయంలో కూర్చోబెట్టి చివరి నిమిషంలో అనుమతి ఇవ్వబోమని చెప్పటం ఏమిటని నిలదీశారు.
ధర్నా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రించలేమని, పోలీసులు చెప్పటం చూస్తే వారి దుస్థితి ఏమిటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగినా... పోలీసుల నుంచి స్పందన రాలేదు. దీనితో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అక్కడే నిద్రకు ఉపక్రమించారు. ఈ ధర్నాలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ఇతర బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment