
అమీర్‌పేట: సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పరిచయమైన ఓ వ్యక్తి జ్యోతిష్కుడిని మోసం చేశాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూకట్‌పల్లిలో స్థలం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షలు కాజేసిన ఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవీ శైలేంద్రనాథ్ అనే వ్యక్తి ఎస్‌ఆర్‌నగర్‌లోని స్వస్థిక్ ప్లాజా హిమాలయా బుక్ స్టోర్ పైఅంతస్తులో నివాసముంటున్నాడు. ప్రసార మాధ్యమాల ద్వారా శైలేంద్రనాథ్ గురించి తెలుసుకుని ఓ వ్యక్తి వచ్చాడు.
తన పేరు సుధాకర్ అని తాను సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. పలుమార్లు జాతకం చూపించుకున్న సుధాకర్ వెంట ఇద్దరు గన్‌మెన్లు కూడా ఉండటంతో పాటు వారి వద్ద గన్స్ కూడా ఉండేవి. కూకట్‌పల్లిలో ఓ చోట ప్రభుత్వ స్థలం ఉందని, అది నీకు వచ్చేలా చూస్తానని, అందులో ఆధ్యాత్మిక కేంద్రం పెట్టుకోవచ్చని నమ్మించాడు.
దీంతో శైలేంద్ర విడతలవారీగా 2019 నుంచి 2021 ఫిబ్రవరి వరకు రూ.25 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకుని సంవత్సరాలు గడస్తున్నా స్థలం ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చి తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శైలేంద్ర కోరారు. డబ్బులు అడిగితే గన్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment