జిల్లా సరిహద్దులోని ఓ పెట్రోల్ బంకు
సాక్షి,తాండూరు(వికారాబాద్): ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లీటర్ రేటు సుమారు రూ. 100 ఉంది. ఇటీవల కేంద్ర సర్కారు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించింది. దీంతో లీటర్ డీజిల్‌పై రూ. 10, పెట్రోల్‌పై రూ.5 తగ్గింది. ఈనేపథ్యంలో వాహనదారులకు కొంత ఊరట కలిగింది. కేంద్ర సర్కారు పిలుపు మేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యాట్ తగ్గించారు. ఈక్రమంలో కర్ణాటకలో డీజిల్‌పై మరో రూ.10 తగ్గడంతో మన జిల్లాకు పొరుగున ఉన్న ఆ రాష్ట్రానికి వాహనదారులు క్యూ కట్టారు. తాండూరు ప్రాంతంలో భారీగా నాపరాతి గనులు ఉన్నాయి. అదేవిధంగా నాపరాతిని లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. పొరుగున ఉన్న కర్ణాటకలో పెట్రో ఉత్పత్తులపై ధరలు తగ్గడంతో మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంకుల్లో వ్యాపారం తగ్గి వెలవెలబోతున్నాయి.
చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ?
8 మండలాలు చేరువలో..
జిల్లాలో 19 మండలాలు ఉండగా అందులో 8 మండలాలు కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. ప్రధానంగా తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలు రాష్ట్ర, జిల్లా సరిహద్దులో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం వ్యాట్ తగ్గించడంతో గతంలో లీటర్ పెట్రోల్ రూ.115 ఉండగా ప్రస్తుతం రూ.109.50 లభిస్తోంది. డీజిల్ ధర గతంలో రూ.108 ఉంటే తగ్గిన ధర ప్రకారం ఇప్పుడు రూ.95.91 దొరుకుతోంది. కర్ణాటకలో పెట్రో ధరలు మరింత తగ్గాయి. అక్కడ డీజిల్ రూ. 85, పెట్రోల్ లీటర్ రూ. 100కు లభిస్తోంది. దీంతో సరిహద్దు మండలాల వాహనదారులతో పాటు తాండూరు ప్రాంతంలోని నాపరాతి గనుల లారీలు మన జిల్లాకు చేరువలో ఉన్న కర్ణాటకకు వెళ్లి ట్యాంక్ ఫుల్ చేసుకొని వస్తున్నారు.
నాపరాతి గనులపై తగ్గిన భారం
తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వందల సంఖ్యలో నాపరాతి గనులు ఉన్నాయి. ప్రతిరోజు గనుల నుంచి యంత్రాల ద్వారా నాపరాతిని వెలికి తీస్తారు. అనంతరం నాపరాతి బండలను వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈనేపథ్యంలో ప్రతిరోజు యంత్రాలకు వేల లీటర్ల మేరకు డీజిల్ అవసరం. తాండూరు ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర కర్ణాటకతో పోలిస్తే అధికంగా ఉండటంతో సరిహద్దు దాటి వెళ్లి డీజిల్‌ను తీసుకొస్తున్నారు. 100 లీటర్ల డీజిల్ అక్కడ కొనుగోలు చేస్తే సుమారు రూ.1000 కలిసి వస్తోంది. దీంతో అక్కడికే వెళ్లేందుకు వ్యాపారులు, వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
వెలవెలబోతున్న జిల్లా బంకులు
జిల్లా సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంకులు పక్షం రోజులుగా వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. తాండూరు మండలం జిన్‌గుర్తి వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకులో పక్షం రోజుల క్రితం వరకు రోజుకు 4 వేల లీటర్ల డీజిల్ విక్రయించేవారు. ప్రస్తుతం 1000 లీటర్లు మాత్రమే సేల్ అవుతున్నట్లు బంకు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారం జరగడం లేదు..
నెల రోజుల క్రితం వరకు మా పెట్రోల్ బంకులో రోజుకు వేల లీటర్ల ఇంధనం విక్రయించే వాళ్లం. కేంద్రం వ్యాట్ తగ్గించింది. కర్ణాటకలో ఆ రాష్ట్ర సర్కారు మరింత తగ్గించడంతో వాహనదారులు, నాప రాతి గనుల వ్యాపారులు అక్కడికే వెళ్తున్నారు. గతంలో మేము రోజు 5 వేల లీటర్ల డిజిల్ అమ్మితే ఇప్పుడు 1000 లీటర్ల లోపే విక్రయాలు జరుగుతున్నాయి. నష్టాలు వస్తున్నాయి.
– రామకృష్ణారెడ్డి, పెట్రోల్ బంకు నిర్వాహకుడు జిల్లా సరిహద్దులోని ఓ పెట్రోల్ బంకు
Comments
Please login to add a commentAdd a comment