చాక్‌పీస్‌ కొన్నా జీఎస్టీ బిల్లు! | PFMS System In Telangana Government Schools | Sakshi
Sakshi News home page

చాక్‌పీస్‌ కొన్నా జీఎస్టీ బిల్లు!

Published Thu, Jan 5 2023 1:10 AM | Last Updated on Thu, Jan 5 2023 10:19 AM

PFMS System In Telangana Government Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ బడుల నిర్వహణ నిధుల వినియోగంలో కొత్త నిబంధనలు ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘పబ్లిక్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌)’ ప్రకారం ప్రతి చిన్న ఖర్చుకు కూడా పక్కాగా జీఎస్టీ బిల్లు ఉండాలనడం, అలా ఉంటేనే ఆడిట్‌ విభాగం ఆమోదిస్తుందని ఉన్నతాధికారులు స్పష్టం చేయడం, ఇకపై నిధులను పాఠశాల ఖాతాలో కాకుండా నోడల్‌ బ్యాంకు ఖాతాలో వేయనుండటం వంటివి ఇబ్బందికరమని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.

పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులే అరకొర అని, అదీ ప్రభుత్వాలకు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు విడుదల చేస్తున్నారని.. దీనికీ సవాలక్ష నిబంధనలు పెడితే బడుల నిర్వహణకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. టీ తెప్పించినా దానికి జీఎస్టీ బిల్లు కావాలంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఇలాంటి విధానం తీసుకొచ్చామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సరిగా అందని నిర్వహణ నిధులు
రాష్ట్రవ్యాప్తంగా 24,852 ప్రభుత్వ పాఠశాలలు, 467 మండల రిసోర్స్‌ కేంద్రాలు (ఎంఆర్సీలు) ఉన్నాయి. ప్రతీ స్కూల్‌ నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి ఏటా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు సమగ్ర శిక్షా అభియాన్‌ నిధులు అందుతాయి. బడులకు కావాల్సిన డస్టర్లు, చాక్‌పీస్‌లు, ఊడ్చే చీపుర్లు, రిజిస్టర్లు, టీచర్ల డైరీలు, శానిటైజర్‌ వంటి సామగ్రి, జాతీయ పర్వదినాల్లో స్వీట్లు, జెండాలు, అలంకరణ సామగ్రి, బిస్కెట్లు, టీలు వంటి వాటికి వినియోగిస్తారు.

వీటికోసం ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందనేది విద్యాశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌లోనే ప్రభుత్వం ఈమేరకు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా బడుల నిర్వహణ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కరోనా కాలంలో 2020–21లో సగం నిధులు కూడా ఇవ్వలేదు. 2021–22లో ముందుగా సగం నిధులిచ్చారు.

ఆర్థిక సంవత్సరం ముగిసే రోజైన మార్చి 31న మిగతా నిధులిచ్చారు. ఈ ఏడాది మాత్రం మొత్తం నిధులు (రూ.74.16 కోట్లు) విద్యా సంవత్సరం మధ్యలో ఇటీవలే విడుదల చేశారు. స్కూళ్లు తెరిచి ఇప్పటికే ఆరు నెలలు కావడంతో ఆయా బడుల ప్రధానోపాధ్యాయులే సొంత జేబు నుంచి నిర్వహణ ఖర్చులు పెట్టుకున్నారు. ప్రభుత్వం నిధులు ఇచ్చాక తీసుకుందామనుకున్నారు. అయితే ఈసారి నిధులు సకాలంలోనే వచ్చినా ‘పీఎఫ్‌ఎంఎస్‌’ విధానం కారణంగా ఇబ్బంది వస్తోందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. వచ్చిన నిధులను వాడుకోవడం కష్టంగా ఉందని, ఇప్పటికే ఖర్చు చేసిన డబ్బులను వెనక్కి తీసుకోవడం సమస్యగా మారిందని అంటున్నారు.

అన్ని ఖర్చులకు జీఎస్టీ బిల్లు ఎలా?
సమగ్ర శిక్షా అభియాన్‌ నుంచి విడుదలయ్యే నిధులు సంబంధిత నోడల్‌ బ్యాంకులో జమవుతాయి. బడిలో చేసే ఖర్చుల వివరాలను, వాటికి సంబంధించిన జీఎస్టీ బిల్లులను హెచ్‌ఎంలు ముందుగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ప్రింట్‌ పేమెంట్‌ అడ్వైజ్‌ (పీపీఏ) ద్వారా స్కూల్‌ హెచ్‌ఎం నోడల్‌ బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాలి. గత ఆరు నెలల్లో చేసిన ఖర్చుల వివరాలను కూడా ఇదే విధానంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

దీనిపై హెచ్‌ఎంలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బడిలో టీలు తెప్పించినా, డస్టర్లు కొన్నా, స్కావెంజర్‌కు శౌచాలయ పనుల కోసం డబ్బులిచ్చినా జీఎస్టీ బిల్లులు ఎలా సమర్పిస్తామని ప్రశ్నిస్తున్నారు. అయితే హెచ్‌ఎంలు చూపించే రూ.5 వేల వరకు ఖర్చుకు నోడల్‌ బ్యాంకు జీఎస్టీ బిల్లులను అడిగే ప్రశ్నే లేదని అధికారులు అంటున్నారు.

ఇది నిజమే అయితే ఆడిట్‌ విభాగం నుంచి స్పçష్టతేదీ ఇవ్వలేదని, కొత్త విధానంలో అన్ని ఖర్చులకు జీఎస్టీ బిల్లు తప్పనిసరని చెబుతున్నారని ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. హెచ్‌ఎం పరిధిలో ఉండే రూ.5 వేలపై అధికారం ఇచ్చినా, మిగతా ఖర్చు ఆడిట్‌లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తలనొప్పిగా మారిన ఈ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తక్షణమే ఈ విధానం మార్చాలి
స్కూల్‌ ఫండ్స్‌లో ప్రతీ పైసాకు జీఎస్టీ బిల్లు సాధ్యం కాదు. ఇది హెచ్‌ఎంల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్య. ఎప్పుడో వచ్చే నిధుల కోసం హెచ్‌ఎంలను ఇబ్బందిలోకి నెట్టడం సరికాదు. దీన్ని తక్షణమే మార్పు చేయాలి.
– చావా రవి, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఆడిట్‌ నుంచి క్లారిటీ ఇవ్వాలి
రూ.5 వేల వరకూ హెచ్‌ఎంలు ఇచ్చే లెక్కను ఆమోది స్తున్నారు. ఆడిట్‌ వాళ్లే సమస్యలు సృష్టించే వీలుంది. ఖర్చు రూ.5 వేలు దాటితేనే జీఎస్టీ ఉంటుందనే భరోసా ఆడిట్‌ విభాగం నుంచి వస్తే బాగుంటుంది. 
– రాజా భానుచంద్ర ప్రకాశ్, ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement