ఎంజీఎం: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి తన తల్లితో చివరిసారిగా మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేస్తున్న వైనాన్ని వివరించింది. అతన్ని సీనియర్లు ఏమీ అనడంలేదని.. ఒకవేళ అతనిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లు తనకు ఏమీ నేర్పించకుండా దూరంపెడతారని తల్లికి చెప్పుకొని బాధపడింది.
వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఇలా..
ప్రీతి: హలో అమ్మా..
తల్లి: అయిపోయిందా డ్యూటీ.
ప్రీతి: లేదమ్మా నైట్ డ్యూటీ. 2, 3 గంటల తర్వాత ఎవరైనా వస్తారు.. వస్తే గాంధీకి వెళ్లాలి. అక్కడ కూడా నైట్ డ్యూటీ.
తల్లి: బండి తీసుకుపోలేదా?
ప్రీతి: తీసుకెళ్లినా..
తల్లి: డాడీ వచ్చిండంట కదా..
ప్రీతి: ఆ వచ్చిండు.. ఆస్పత్రి దగ్గర దించిండు. మళ్లీ హెచ్‌ఓడీ దగ్గరకు వెళ్లి మాట్లాడినా.. చూసుకుంటా అన్నాడు.
తల్లి: నువ్వు ఒక్కదానివే వెళ్లినవా.. డాడీ కూడా వచ్చాడా.
ప్రీతి: నేనే వెళ్లినా.. డాడీ పనిలో ఉండే.. నేను వెళ్లినా.. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా.. ప్రిన్సిపాల్ సర్ దగ్గరికి ఎందుకు వెళ్లినావు అని హెచ్‌ఓడీ అడిగాడు. ఆయనను పిలిచి ఏం మాట్లాడిండో తెలియదు. వాని గురించి డాడీకి ఫోన్ చేయాలి.. నన్ను ఏం చేస్తారు? అంటున్నాడు. ఆయన పేరు కంప్లైంట్ చేసినా సీనియర్లు నాకు ఏమీ నేర్పించకుండా దూరం పెడతారు.
తల్లి: సెకండియర్ అంతా ఒక్కటేనా.. అందరూ అలాగే ఉంటారా..?
ప్రీతి: అందరూ ఆయనలాగా ఉండరు..
తల్లి: వాళ్లు అతన్ని ఏమీ అనడం లేదా.. అలా ఎందుకు చేస్తున్నావని..?
ప్రీతి: అలా ఎవరూ అనడం లేదు.
తల్లి: వీడు అంత ఇదా.. హెచ్‌ఓడీ మాట కూడా వినడా..?
ప్రీతి: ఏం తెలియదు..
తల్లి: నువ్వేపోయి చెప్పినావా..?
ప్రీతి: లేదు.. ప్రిన్సిపాల్‌కు డాడీ ఎవరితో చెప్పించిండో తెలియదు.. హెచ్‌ఓడీ పిలిపించి అడిగిండు. ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లినావు అన్నాడు. నేను పడుతున్న ఇబ్బంది గురించి హెచ్‌ఓడీకి చెప్పినా.
తల్లి: ఏం భయపడకు.. మనం వరంగల్‌లోనే ఉన్నాం. ఎక్కడో దేశంలో లేం.. రెండు, మూడు రోజుల్లో కాలేజీకి వస్తాం.
రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో సైఫ్‌పై వస్తున్న ఆరోపణలతోపాటు పోలీసులు నమోదు చేసిన కేసులపై మంగళవారం కేఎంసీలో యాంటీ ర్యాంగింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు.
సైఫ్ ఘటనలో జరిగిన వివరాలను చర్చించి ఢిల్లీ యాంటీ ర్యాగింగ్ కమిటీతోపాటు కాళోజీ ఆరోగ్య వర్సిటీకి సైతం నివేదిక సమర్పించనున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు సైఫ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment