సాక్షి, హైదరాబాద్/ఎంజీఎం/సుల్తాన్‌బజార్(హైదరాబాద్): వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడినట్టు.. వైద్యులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నట్టు వివరించారు.
ఘటనపై ఢిల్లీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆరా: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి వేధింపులే కారణమని పత్రికల ద్వారా తెలుసుకున్న ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు స్పందించారు. ఘటన వివరాలను వెంటనే తెలపాలంటూ కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్‌ను ఆదేశించారు. దీంతో కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ అధ్యక్షతన శుక్రవారం కాకతీయ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
సీనియర్ విద్యార్థిపై చర్యకు డిమాండ్: పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సీనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత తమ్మినేని డిమాండ్ చేశారు. అలాగే, సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్‌రెడ్డి వేరొక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏబీవీపీ ధర్నా.. నేతల అరెస్టు: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు గురువారం కోఠిలోని వైద్య విద్య సంచాలకుని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తాన్‌బజార్ పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. దీంతో ఉభయులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇన్‌స్పెక్టర్ బాలగంగిరెడ్డి ఏబీవీపీ నేతలను అరెస్టు చేసి సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment