సాక్షి, మంచిర్యాల: పత్తాలాట రాష్ట్రంలో పత్తాలేకుండా పోయినా సరిహద్దుల్లో దాని జాడలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేకాట, మట్కా వంటి జూదాలను ప్రభుత్వం నిషేధించడంతో సరిహద్దుల్లో పేకాట స్థావరాలు వెలిశాయి. మన రాష్ట్రంలో రహస్యంగా ఎక్కడైనా ఆడితే పోలీసు, టాస్క్‌ఫోర్స్‌కు చిక్కే ప్రమాదముందని భయపడిన జూదరులు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర సరిహద్దుల్లో ‘చేతివాటం’ప్రదర్శిస్తున్నారు.
చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో స్పోర్ట్స్ క్లబ్‌ల పేరుతో పేకాట దందా సాగుతోంది. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆనుకుని మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా అంకీసా, దుబ్బపల్లి, నందిగాంలో, నిర్మల్ జిల్లా సరిహద్దు నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్టణం, బాసర సమీప గ్రామం నవీపేటలో పేకాట జోరుగా నడుస్తోంది. రోజూ వందలాది మంది జూదరులు రూ.లక్షలు పెట్టి పేకాట ఆడుతున్నారు. జూదరుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ, సినీప్రముఖులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు.
క్లబ్‌లో సకల సౌకర్యాలు
పత్తాలాట నిర్వాహకులు ఏసీ గదుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆడిఆడి అలసిపోతే అక్కడే పడుకోవచ్చు. టాయిలెట్లు, బాత్‌రూముల వసతి కూడా ఉంది. తాగునీరు, టీ, స్నాక్స్, జ్యూస్‌లు, చికెన్, మటన్‌తో కోరిన భోజనం అందిస్తుంటారు. కొందరైతే రోజుల తరబడి అక్కడే బస చేస్తున్న సందర్భాలున్నాయి. జూదరుల జేబులు ఖాళీ అయితే నమ్మకస్తులకు ఒంటి మీది బంగారం, వాహనం కుదవ పెట్టుకుని అప్పులు కూడా ఇస్తుంటారు.
ఆటలో నగదుతోపాటు గూగుల్ పే, ఫోన్ పే తోనూ చెల్లిస్తున్నారు. జూదరులకు రానుపోను వాహన ఖర్చులు, ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఇస్తున్నారు. సిరోంచకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా, ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి జూదరులు వస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన జూదరులు సరిహద్దు ఉన్న ధర్మాబాద్ వైపు వెళ్తున్నారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఓ క్లబ్ వెలిసినప్పటికీ మావోయిస్టుల ప్రభావంతో దానిని మూసివేశారు.
మహారాష్ట్రలో మైండ్ గేమ్‌గా..
దేశంలో ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867’ప్రకారం నేరుగా డబ్బులతో ఆటలు ఆడటం నిషేధం. చాలా రాష్ట్రాలు పేకాటను పూర్తిగా నిషేధించాయి. మహారాష్ట్ర, గోవా లో షరతులతో కూడిన మైండ్‌గేమ్‌గా పిలిచే రమ్మీ ఆడుకోవచ్చు. కానీ, డబ్బులు పెట్టి ఆడటం నిషేధం. మహారాష్ట్రలో ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్‌ల సభ్యులకు పేకాట అనుమతి ఉన్నా డబ్బులు పెట్టి ఆడరాదు.
దీనిని ఆసరా చేసుకుని మహారాష్ట్రలో చట్టబద్ధమైన ఆట అని ప్రచారం చేస్తూ తెలంగాణ పేకాట రాయుళ్లకు వల వేస్తున్నారు. గడ్చిరోలి జిల్లా సిరోంచ, నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్ట ణం, శివారు నవీపేటలో గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాలకు చెం దిన వాళ్లే క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. ఇటీవల చంద్రాపూర్ జిల్లా రాజురా, పోడ్సా క్లబ్‌లను అక్కడి అధికారులు మూసివేశారు.
రోజుకు రూ. లక్షల్లో ఆర్జన
పేకాట నిర్వాహకులకు రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. క్లబ్‌లో కనీసం రూ.5 వేలు నుంచి రూ.20 వేలతో పేకాట ఆడే టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్‌కు తొమ్మిది మంది చొప్పున ఉంటారు. ఇందులో ఒకరి డబ్బులు నిర్వాహకులు తీసుకుంటారు. ఐదువేల టేబుల్‌కు రూ.ఐదు వేలు, రూ.20 వేల టేబుల్‌కు రూ.20 వేలు తీసుకుంటారు. ఆటలో గెలిచినవారికి మిగతా డబ్బులు ఇస్తారు.
ఒక్కో క్లబ్‌లో కనీసం ఆరు నుంచి పది టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్‌కు ఓ డీలర్ ఉంటాడు. అతడు పేక ముక్కలు పంచడం, లెక్కలు వేయడం, డబ్బులు తీసుకోవడం చేస్తుంటాడు. రోజూ మధ్యాహ్నం మొదలై తెల్లవారు జామున 4 గంటల వరకు పత్తాలాట సాగుతోంది. గతంలో నిమిషాల్లో రూ.లక్షలు ఆవిరి చేసే కట్ పత్తా లాంటి ఆటలు ఆడగా, ప్రస్తుతం రమ్మీ మాత్రమే నడుస్తున్నాయి. ఈ దందాకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు దండిగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment