సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నేతలను జాతీయ పార్టీ దూతలు ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, పటిష్టానికి ఈ భేటీని వినియోగించుకునే దిశగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఈ మేరకు కార్యవర్గ భేటీ సన్నాహాలపై బుధవారం రాష్ట్ర నేతలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తదితరులతోపాటు వివిధ కమిటీలతో సమీక్షించారు. వచ్చేనెల 2న భేటీకి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో.. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ దాకా పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనేలా రోడ్‌షో నిర్వహించాలని.. లేదా 3వ తేదీన సమావేశాల ముగింపు సందర్భంగా ఎల్‌బీ స్టేడియం లేదా మరోచోట బహిరంగసభ నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై గురువారం జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఐదుగురితో స్టీరింగ్ కమిటీ
వచ్చే నెల 2, 3 తేదీల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, సీనియర్ నేతలు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డిలతో స్టీరింగ్ కమిటీని బీజేపీ జాతీయ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఇక భేటీ ఏర్పాట్లు, సన్నాహాలు, రవాణా, భోజనం, వసతి తదితరాల కోసం కూడా పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భేటీ నిర్వహణకు భారీగా ఆర్థిక వనరులు అవసరమయ్యే నేపథ్యంలో.. కొందరు పెద్ద మొత్తాల్లో ఇచ్చే విరాళాలతోపాటు క్షేత్రస్థాయిలో డెబిట్, క్రెడిట్‌కార్డుల వంటి డిజిటల్ పద్ధతుల్లో కూడా చిన్నచిన్న మొత్తాల్లో విరాళాలు సేకరించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
8 ఏళ్ల మోదీ పాలనపై జిల్లాల్లో సభలు
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా.. ఈ నెల 10 నుంచి 15దాకా అన్ని జిల్లాల్లో ‘ప్రజా సంక్షేమ పాలన సదస్సు’లు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. 10న మల్కాజిగిరి, మేడ్చల్ అర్బన్ జిల్లాలో నిర్వహించే సభలో బండి సంజయ్ పాల్గొంటారు. 11న రంగారెడ్డి రూరల్ జిల్లాలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, 12న మంచిర్యాలలో ఎంపీ కె.లక్ష్మణ్. 13న యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ములుగు జిల్లాలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, 14న మెదక్ జిల్లాలో ఎన్.మురళీధర్‌రావు, నల్లగొండ జిల్లాలో డీకే అరుణ, భద్రాద్రికొత్తగూడెంలో ఎంపీ సోయం బాపూరావు, జనగామ జిల్లాలో ఏపీ జితేందర్‌రెడ్డి, 15న హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో కేంద్రమంత్రి నారాయణ్‌రాణే, ఆదిలాబాద్ జిల్లాలో బండి సంజయ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొంటారు. ఆయా సభల్లో ఇతర నేతలు కూడా పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment