
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
సాక్షి, జవహర్‌నగర్/బీబీ నగర్: ఓ యువకుడిని ఎక్కడో దారుణంగా హత్య చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ శివారులో కాల్చేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పరిధిలోని డీజేఆర్ కాలనీ జోహర్‌నగర్ నివసిస్తున్న మోట రాము(35) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే కాలనీలో నివాసముంటున్న చీర వెంకటలక్ష్మి కుటుంబంతో గొడవలు ఉన్నాయి.
కూతురు ఆత్మహత్యకు కారకుడయ్యాడని..
చీర వెంకటలక్ష్మి కూతురు భార్గవిని రాము కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాము వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన భార్గవి ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. తన కూతురు ఆత్మహత్యకు రాము వేధింపులే కారణమని వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు భరత్‌లు అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే రామును సోమవారం మేడ్చల్ పరిధిలోనే దారుణంగా హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని ఆటోలో వేసుకుని బీబీనగర్ మండలం రాయరావుపేట శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు. అనంతరం వెంకటలక్ష్మి, భరత్ నేరుగా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రామును తామే హత్య చేసి కాల్చేశామని నేరం అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు రాయరావుపేట శివారులో రాము మృతదేహాన్ని గుర్తించారు. ఘటన స్థలాన్ని భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.