సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి దారుణ హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, మరోవ్యక్తి చిరంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రామగుండం పోలీసులు మీడియా సమావేశం నిర్వహించిన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వామన్‌రావు, నాగమణి నిర్మిస్తున్న పెద్దమ్మగుడి వివాదం కారణంగానే ఈ హత్య జరిగిందని వెల్లడించారు. అక్కపాక కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నిందితులు న్యాయవాద దంపతులను హత్యచేశారని తెలిపారు.
ఘటన అనంతరం సుందిళ్ల వైపు వెళ్లారని, రక్తపు బట్టలను అక్కడి బ్యారెజ్‌లో పడేసి మహారాష్ట్రకు పారిపోయారని పేర్కొన్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయంలో వామన్‌రావు అడ్డుపడుతున్నాడనే కారణంతోనే కుంట శ్రీనివాస్ ఈ హత్యకు పథకం రచించాడని చెప్పారు. పాతకక్షల కారణంగానే న్యాయవాద దంపతులను హత్య చేశారని పేర్కొన్నారు. బ్రీజా కారుతో తొలుత వామన్‌రావు వాహనాన్ని ఢీకొట్టారని, వామన్‌రావుపై చిరంజీవి, శ్రీనివాస్ కలిసి ఏకకాలంలో వారిపై దాడి చేసినట్లు వివరించారు. తొలుత కారులో ఉన్న నాగమణిపై కత్తులతో పాశవికంగా దాడిచేయడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందినట్లు తెలిపారు. అనంతరం వేటకొడవళ్లతో వామన్‌రావుపై దాడికి తెగబడ్డారని వెల్లడించారు. కేసులో మరికొంత మంది విచారణ జరుగుతోందని, త్వరలోనే విచారణ పూర్తిచేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment