పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్‌ వెళ్తుండగా.. | Police Arrest Womens at Shamshabad Airport Having Doble Visas | Sakshi
Sakshi News home page

Shamshabad Airport: పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్‌ వెళ్తుండగా..

Published Tue, Dec 7 2021 4:27 PM | Last Updated on Wed, Dec 8 2021 3:35 AM

Police Arrest Womens at Shamshabad Airport Having Doble Visas - Sakshi

శంషాబాద్‌: ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు.

ఇమిగ్రేషన్‌ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్‌ వీసాలు చూపించారు. కువైట్‌కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్‌ వీసాలతో పాటు వర్క్‌ వీసాలు కూడా లభ్యమయ్యాయి.

ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్‌కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు.  

వారికి తెలియకుండా.. 
మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్‌కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్‌ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్‌ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్‌ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు.

ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్‌ వీసాను ఇక్కడ బయలుదేరే సమయంలో చూపించాలని, వర్క్‌ వీసాలను కు వైట్‌లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. 

రెండు వీసాలు ఎందుకు..? 
పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్‌ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్‌ (ఇమిగ్రేషన్‌ చెకింగ్‌ రిక్వైర్డ్‌)లో భాగంగా ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్‌ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఏజెంట్లపై కేసు 
ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్‌ వీసాలు జారీ చేశారు. వర్కింగ్‌ వీసాలకు ఈసీ ఆర్‌ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్‌ వీసాలతో పాటు వర్కింగ్‌ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. 
– విజయ్‌కుమార్, సీఐ, ఆర్‌జీఐఏ 

అయోమయంగా ఉంది.. 
మాది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. ఉపా« ది నిమిత్తం కువైట్‌ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌కు పంపారు. గతంలో లాక్‌డౌన్‌లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది.          
– బాధిత మహిళ 

చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్‌ టెక్నిషియన్‌ నిర్వాకం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement