
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి తెర పడటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విధ్వంసం సృష్టిస్తారన్న ముందస్తు సమాచారంతో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ శ్రేణుల ఆందోళనల సమాచారంతో ప్రగతిభవన్, టీఆర్‌ఎస్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తచర్యగా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లిలో ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హౌస్ అరెస్ట్ చేశారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్ )
హయత్‌నగర్‌లో బీజేపీ ధర్నా...
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. డీజీపీ ఆఫిస్, ప్రగతిభవన్ ముట్టడిస్తామని తమపై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ నేతలు భైటాయించారు. నేతలను అరెస్ట్ చేసి తమ హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే సామ రంగారెడ్డితో పాటు సీనియర్ నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి 20మంది కార్యకర్తలను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.