సాక్షి, సిద్దిపేట: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు నష్టపరిహారం కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టడం.. విద్యుత్ సరఫరా నిలిపివేసి, పలువురిని అరెస్టు చేయడం.. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జీతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనితో నిర్వాసితులు ఆందోళనను మరింత ముమ్మరం చేశారు.
పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలంటూ..
రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గూడాటిపల్లిలో 8.23 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాజెక్టు కాల్వ నిర్మాణం కోసం సర్వే పనులు జరుగుతున్నాయి. అయితే తమకు పూర్తి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలంటూ నిర్వాసితులు రెండు రోజులుగా పనులను అడ్డుకుంటున్నారు.
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గూడాటిపల్లిలో మోహరించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇళ్లలోని నిర్వాసితులను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మహిళలు, కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీకి దిగి చెదరగొట్టడంతో.. పలువురికి గాయాలయ్యాయి.
పాదయాత్రగా హుస్నాబాద్‌కు..
అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు గూడాటిపల్లి నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. హుస్నాబాద్ ఎల్లమ్మ గుడివద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు దిగివచ్చి అనుమతి ఇవ్వడంతో నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి నిర్వాసితులతో మాట్లాడారు. అరెస్టైన వారిని విడుదల చేయించారు. పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నిర్వాసితులు వెనక్కి తగ్గలేదు. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు నిరసన చేపట్టారు. అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం హుస్నాబాద్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది.
పోలీసులు క్షమాపణ చెప్పాల్సిందే: సీపీఐ నారాయణ
భూనిర్వాసితులపై లాఠీచార్జీ చేసిన పోలీసు లు క్షమాపణ చెప్పాలని, వారిని వెంటనే స స్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆ ధ్వర్యంలో సోమవారం హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భం గా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాకలో నిర్వాసితులకు చెల్లించినట్టు గా గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేసిన పా పాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం జాతీ య స్థాయికి వెళ్తున్నారని మండిపడ్డారు.
దాడి క్షమించరానిది: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ వారికి సరైన పరిహారం ఇవ్వాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ నిర్వాకంతో నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా పరిహార ప్యాకేజీ అమలు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇంకో ఎకరం డబ్బులు రావాలి
గౌరవెల్లిలో 5 ఎకరాల భూమి కోల్పోయాను. 4 ఎకరాలకు సంబంధించిన డబ్బులే చెల్లించారు. ఇంకా ఎకరం డబ్బులివ్వాలి. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద స్థలమిస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించాకే ప్రాజెక్టు పనులు చేయాలి.
– భూక్యా స్వప్న, సేవగాని తండా
భూమికి భూమి ఇవ్వాలి
గౌరవెల్లి రిజర్వాయర్ కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమి సేకరించారు. అందులో 88 ఎకరాలకు సంబంధించిన రైతులు సంతకాలు చేయలేదు. కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతున్నాం. మల్లన్నసాగర్ నిర్వాసితులతో సమానంగా మాకూ నష్టపరిహారం చెల్లించాలి.
– బద్దం ఎల్లారెడ్డి, గూడాటిపల్లి
Comments
Please login to add a commentAdd a comment