బంజారాహిల్స్: ట్రాఫిక్ డైవర్షన్ వల్ల మీరు ఆనందంగా ఉన్నారా..? ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? ఈ డైవర్షన్‌ను ఇలాగే కొనసాగించాలా..? ఎత్తేయాలా..? అంటూ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ డైవర్షన్‌పై వాహనదారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత నెల 24న రోడ్ నెం.45లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పలు చోట్ల వాహనాల మళ్లింపు, ‘యూ’ టర్న్‌లు, జంక్షన్ల మూసివేత, అంతర్గత రహదారుల వినియోగం తదితర చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇవి కొంత మందికి ఇబ్బంది కలిగిస్తుండగా మరి కొందరు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే, పోలీసులు క్షేత్ర స్థాయిలో నేరుగా వాహనదారుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి వాహనదారులతో ముచ్చటిస్తున్నారు. ఈ రహదారులపై రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వాహనదారులను గుర్తించి వారి నుంచే అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45, రోడ్ నెం. 36, ఫిలింనగర్ రోడ్ నెం.1, జర్నలిస్టు కాలనీ, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రతినిధులు వాహనదారులను ట్రాఫిక్ డైవర్షన్‌పై పలు కోణాల్లో ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నారు. వీటిని క్రోడీకరించి నగర పోలీస్ కమిషనర్‌కు నివేదిక అందించేందుకు సిద్ధమవుతున్నారు.
నేడో, రేపో కమిషనర్‌కు ట్రాఫిక్ వెస్ట్‌జోన్ డీసీపీ ఈ నివేదికను అందించనున్నారు. మరో వైపు డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రాకపోకలను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టకముందు, చేపట్టిన తర్వాత అనే రెండు కోణాల్లో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. వాహనదారులు ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తున్నది..? డైవర్షన్ వల్ల ఎంత సమయం ఆదా అవుతున్నది.. తదితర వివరాలను కూడా నివేదిక రూపంలో కమిషనర్‌కు అందించనున్నారు. ట్రాఫిక్ పోలీసులు క్షేత్ర స్థాయి పరిశీలనతో కూడిన నివేదికను పరిశీలించిన తర్వాత నగర పోలీస్ కమిషనర్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ డైవర్షన్‌పై ఓ నిర్ణయాన్ని వెలువరించనున్నారు. కొనసాగించాలా..? వద్దా..? అన్నది వాహనదారుల అభిప్రాయాల ద్వారానే నిర్ణయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment