మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే నిర్వహిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, ఆరు గ్యారంటీలను వందరోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ప్రజాపాలన దరఖాస్తులు..తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయ మీడియా సెంటర్‌లో వెల్లడించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడు తూ కోటి ఐదు లక్షల దరఖాస్తులు ఆరు గ్యారంటీలకు రాగా, మరో 20 లక్షల దరఖాస్తులు రేషన్‌కార్డులు, ఉద్యోగాలు, భూసమస్యలపైనా వచ్చాయన్నారు. 30వేల మందికిపైగా ఆపరేటర్లతో యుద్ధప్రాతిపదికన డేటాఎంట్రీ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 13 నుంచి 14 శాతం వరకు ఎంట్రీ పూర్తయ్యిందని, మొత్తం పూర్తిచేసేందుకు ఈనెల 25 నుంచి 30వతేదీ వరకు సమయం పడుతుందని, ఆలోపు పూర్తి సమాచారం కంప్యూటరీకరిస్తామన్నారు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను లింకప్ చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ హామీలన్నీ అందిస్తామని చెప్పారు.
డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత అర్హులందరి లిస్ట్ గ్రామాల వారీగా వెల్లడిస్తామన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి అధికారులు వెళ్లి వివరాలు మరోసారి పరిశీలిస్తారని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 40 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గతంలో తామెప్పుడూ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, మల్లిఖార్జున ఖర్గే, రాహూల్‌గాందీ, ప్రియాంకగాందీలు సైతం ఎక్కడా ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదన్నారు.
తాము అధికారంలోకి వచ్చి మంగళవారానికి నెలరోజులు అవుతుందని, ఈలోపే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులు కూడా కాకముందే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. విమర్శలు చేసే ముందు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. గత ప్రభుత్వ తప్పులను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రతిపక్షాలు, మీడియా సైతం ఓపిక పట్టాలని కోరారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘంలో విధివిధానాలపై చర్చిస్తామన్నారు. వీటన్నింటిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేయని అర్హులైనవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాపాలన వెబ్‌సైట్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
కమిటీలో ఎవరంటే..
ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ సబ్‌కమిటీని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సబ్‌కమిటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు తాను సభ్యుడిగా ఉన్నానని పొంగులేటి చెప్పారు. ఈ కమిటీ ఆరు గ్యారంటీల అమలుపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని తెలిపారు. రేషన్‌కార్డులపైనా త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు.
ప్రస్తుతం 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని, కార్డులు లేనివారి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈనెల 6వ తేదీ నుంచి అధికారులంతా ఓటర్‌లిస్ట్ ప్రక్రియలో ఉన్నారని, అయినా ఆరు గ్యారంటీల అమలు ప్రక్రియలో భాగంగా డేటాఎంట్రీ కొనసాగుతుందన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచి్చన భూములకు సంబంధించిన జీఓలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment