ఎన్టీఆర్ స్టేడియంలో సిద్ధంగా పోర్టబుల్ పాండ్
సాక్షి, హైదరాబాద్: ఇదివరకు సహజసిద్ధమైన చెరువులు, కొలనుల్లో గణేశ్ నిమజ్జనాలు జరిగేవి. చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా విగ్రహాల నిమజ్జనం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేబిపాండ్స్ (నిమజ్జన కొలనులు) వినియోగిస్తున్నారు. ఈసారి కొత్తగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్‌ప్లాస్టిక్ (ఎఫ్‌ఆర్‌సీ) పాండ్స్, నేలను తవ్వి తాత్కాలిక పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తాత్కాలిక పాండ్స్, ఎఫ్‌ఆర్‌సీ పాండ్స్ పనులు వడివడిగా జరుగుతున్నాయి.
మూడో రోజు నుంచే..
బుధవారం వినాయకచవితి.. మూడోరోజు నుంచే చిన్నసైజు విగ్రహాల నిమజ్జనం జరగనుంది. వాటికోసమే ఉద్దేశించిన ఈ పాండ్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో ఎఫ్‌ఆర్‌సీ పాండ్స్ పోర్టబుల్‌వి. వీటిని ఎక్కడంటే అక్కడ.. ఎప్పుడంటే అప్పుడు ఏర్పాటు చేసే సౌలభ్యం ఉంది. ఇవి చూడ్డానికి ఆకర్షణీయంగానూ ఉండటంతో కాలనీల్లోని స్థానిక ప్రజలు వీటిని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది.
నగరంలోని అన్ని జోన్లలో ఈ పాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో రెండు పోర్టబుల్ పాండ్లు, ఒక తాత్కాలిక పాండ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మిగతా జోన్లలోనూ పనులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు,నాలుగున్నర అడుగుల లోతుతో ఈ పాండ్స్ ఏర్పాటవుతున్నాయి.
ఈ పాండ్స్‌లోకి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతారు. నిమజ్జనం కాగానే విగ్రహాలు, పూజా సామగ్రి వెంటనే తొలగించి వేరే చోటుకు తరలిస్తారు. నీరు పరిశుభ్రంగా ఉండేందుకు నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు తాజా నీరు నింపుతారని అధికారులు పేర్కొన్నారు. లోతు నాలుగున్నర అడుగులే అయినప్పటికీ, విగ్రహాలను అడ్డంగా పాండ్స్‌లోకి వేసి నిమజ్జనం చేయడం ద్వారా అంతకంటే పెద్ద విగ్రహాలు కూడా నిమజ్జనం చేయవచ్చని అధికారులు తెలిపారు. నిమజ్జనాలు ముగిసేంత వరకు వినియోగించే పోర్టబుల్ పాండ్స్‌ను అవసరాల కనుగుణంగా ఎక్కడంటే అక్కడ మాత్రమే కాకుండా వేసవిలో జీహెచ్‌ఎంసీ స్టేడియంలలో స్విమ్మింగ్ పూల్స్ గానూ వినియోగించుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment