సాక్షి, హైదరాబాద్: నేర ప్రవృత్తిని వీడనాడే రౌడీలపై ఇక నుంచి పాజిటివ్ షీట్లు తెరుస్తామని, దీంతో వారు చేసే మంచి పనులు కూడా రౌడీ షీట్ రికార్డులో నమోదవుతాయని, మార్పు పూర్తిగా వస్తే రౌడీ షీట్‌ను తొలగిస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. మార్పు కోసం ప్రయత్నించే రౌడీలకు సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఆదివారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వందకు పైగా రౌడీ షీటర్లు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో నేరాలకు పాల్పడిన వారు వాటిని వీడనాడి ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాలని సూచించారు.
తొందరపాటులో నేరాలు చేసి నా సరే.. తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందన్నారు. డాక్టర్ బిడ్డలు డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు పోలీసులు అవుతున్నారని.. రౌడీ షీటర్ల పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారు అవుతారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఇదో మంచి అవకాశమని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక నుంచి డిసెంబర్ 31 అంటే రౌడీ మార్పు దినోత్సవంగా గుర్తిండిపోవాలని పిలుపునిచ్చారు.
రౌడీషీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి ధారావత్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్‌ఓటి డీసీపీ –1 గిరిధర్ రావుల, ఎస్‌ఓటి డీసీపీ–2 మురళీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment